దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్
ABN , Publish Date - Sep 18 , 2026 | 05:35 PM
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. సత్యమేవ జయతే అని ఆయన తెలిపారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడటం ఖాయమని ఈ సందర్భంగా కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుక్రవారం కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలకు హరీశ్ రావు సవాల్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీరును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యే దానంపై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై ఆయన స్పందించారు. దానం నాగేందర్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ రక్షణ కల్పించారని మండిపడ్డారు. రాజ్యాంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి బయటపడిందని విమర్శించారు. నిబద్ధత ఉంటే ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. మరోసారి ప్రజల తీర్పు కోరాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెలే హరీశ్ రావు సవాల్ విసిరారు.
హైకోర్టును ఆశ్రయించిన ఆ ఇద్దరు
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుటికి చేరారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అందుకు తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్... ఆ ఫిర్యాదును తొసిపుచ్చారు.
ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ అసెంబ్లీలోని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
దానంకు పట్టిన గతే.. మిగతా ఎనిమిది మందికీ పడుతుంది: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్వాగతించిన బీజేపీ నేతలు
For More TG News And Telugu News