Share News

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్వాగతించిన బీజేపీ నేతలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:51 PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్వాగతించిన బీజేపీ నేతలు
BJP MLA Alleti Maheshwar Reddy

హైదరాబాద్, సెప్టెంబర్18: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ న్యాయం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తీర్పును కోర్టు కొట్టివేయడం.. ప్రజస్వామ్యాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు.


ఇతర పార్టీల ఎమ్మెల్యేలను వాళ్ల వైపు తిప్పుకునే ప్రయత్నానికి కోర్టు తీర్పు ఓ చెంప పెట్టు అని అభివర్ణించారు. న్యాయం కోసం బీజేపీ పోరాటం చేసిందని ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఇక పార్టీ మారిన మిగిలిన వాళ్లతో కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ శాసనసభలో బీజేఎల్పీ నేత అభిప్రాయపడ్డారు. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్లకుండా రాజీనామా చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. దీనిపై శనివారం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇది ప్రజాస్వామ్య విజయం: మాజీ ఎమ్మెల్యే చింతల

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు.

ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించే దాన్ని పరిరక్షించే తీర్పుగా దీనిని భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని గుర్తు చేశారు. దేశంలో పిటిషన్ వేసిన ఆరు నెలల్లో తీర్పు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఈ తీర్పు అందరి విజయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి తెలిపారు.


ఏం జరిగందంటే..

2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో దానం నాగేందర్ ఉన్నారు.


దీంతో దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. దానం విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అతడిపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బీజేపీకి చెందిన పలువురు నేతలు స్వాగతిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. మహిళా కార్మికుల అరెస్ట్

For More TG News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 05:08 PM