సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు: హరీశ్ రావు
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:32 PM
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు స్వాగతిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గురువారం ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు. దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ పరిరక్షణ గురించి పదే పదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోంది’.
‘రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా “సంవిధాన్ బచావో” అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చింది. రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజమైన నిబద్ధత ఉంటే.. కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ప్రజల తీర్పు కోరాలని ఆయన డిమాండ్ చేయాలి’.
‘ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో తమ పార్టీ అనుసరిస్తున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?. “సంవిధాన్ బచావో” అనేది కేవలం రాజకీయ నినాదమా? లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా? రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ప్రజాక్షేత్రంలోకి పంపాలి’ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
Read Latest TG News And Telugu News