కాలినడకన పోలీసుల గస్తీ
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:37 AM
సామాన్యులకు మేమున్నామని ధైర్యమిస్తూ సైబరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో కాలినడకన గస్తీ (ఫుట్ ప్యాట్రోలింగ్) చేస్తూ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక శాంతిభద్రతలను తెలుసుకుంటున్నారు.
సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
హైదరాబాద్ సిటీ: సామాన్యులకు మేమున్నామని ధైర్యమిస్తూ సైబరాబాద్ పోలీసులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో కాలినడకన గస్తీ (ఫుట్ ప్యాట్రోలింగ్) చేస్తూ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక శాంతిభద్రతలను తెలుసుకుంటున్నారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కార్యాచరణ అమలుకు పోలీసులు నడుం బిగించారు. జనసంచారం అధికంగా ఉండే ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు, నివాస కాలనీలు, చిన్న చిన్న వీధుల్లో ప్యాట్రోల్ కార్లు, బ్లూ కోల్ట్ సిబ్బంది తమ వాహనాలను నిలిపివేసి కాలినడకన పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
గస్తీ లక్ష్యం ఇదే..
ప్రజల్లో భద్రతా భావనను పెంపొందించడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, అనుమానితులను తనిఖీ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రాత్రి వేళల్లో ప్రజల్లో ధైర్యం పెరగడమే కాకుండా, నేరస్థుల్లో భయం కలుగుతోంది. క్షేత్రస్థాయిలో స్థానికులతో నేరుగా సంభాషించడం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. నేర నియంత్రణకు సాధ్యపడుతుంది.
ప్రయోజనాలు..
బ్లూ కోట్స్ పెట్రోలింగ్ సిబ్బంది వాహనాలను పక్కన పెట్టి, మార్కెట్లు, బస్టాండ్‌లు, నివాస ప్రాంతాల్లో కాలినడకన పర్యటించడం, శాంతి భద్రతల సమస్యలు తెలుసుకోవడం నేరాల కట్టడి: వాహనాలు వెళ్లలేని సందుల్లో కూడా పోలీసులు తిరగడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పడే అవకాశం ప్రజలతో మమేకం: రాత్రి వేళల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం అప్రమత్తత: అనుమానాస్పద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు. వారి కదలికలపై డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం.
వివరాల సేకరణ : రాత్రి వేళల్లో కారణం లేకుండా తిరిగే వారు, పాత నేరస్థుల వివరాల సేకరిస్తారు. నిర్మానుష్య ప్రాంతాలలో మద్యం సేవించే వారి కట్టడి, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఆస్కారం వాహన తనిఖీలు: నంబర్ ప్లేట్ సరిగ్గా లేని, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు తనిఖీలు శారీరక చురుకుదనం: నిరంతరం నడవడం వల్ల పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెరుగుతుంది.
ప్రజల్లో విశ్వాసం: ప్రజల మధ్య ఉండటం వల్ల పోలీసులపై భరోసా భావం పెరుగుతుంది.
ముందస్తు సమాచారం: స్థానికులతో స్నేహపూర్వకంగా ఉండడం వల్ల ఒక్కోసారి నేరాలకు సంబంధించిన ముందస్తు సమాచారం తెలుసుకునే వీలుంది.
క్షేత్రస్థాయిలోని పరిస్థితుల పరిశీలన
వాహనాల్లో వెళ్లేటప్పుడు కేవలం పైపైన మాత్రమే చూడగలం, కానీ, నడిచినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను స్వయంగా గమనించే వీలుంది. తద్వారా ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది. నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయడం, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం కోసం కాలినడక గస్తీని నిరంతరం కొనసాగిస్తాం.
పి. సతీష్, ఇన్‌స్పెక్టర్, దుండిగల్ పోలీస్ స్టేషన్
వృత్తిపరమైన సంతృప్తి
కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలకు రక్షణగా నిలుస్తున్నామనే భావన సంతృప్తినిస్తుంది. ప్రజల మధ్య తిరగడం వల్ల ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వారు వెంటనే సమాచారం ఇస్తున్నారు. ఇది నేరాల నివారణకు (ప్రివెంటివ్ పోలీసింగ్)కు ఉపకరిస్తుంది. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలు చొరవగా మాట్లాడుతున్నారు. వారి సమస్యలు మా దృష్టికి తెస్తున్నారు.
- రామ్మోహన్, ఎస్‌ఐ, దుండిగల్
ప్రజలకు మరింత దగ్గరగా వెళుతున్నాం
కాలినడక గస్తీ వల్ల వాహనాలు వెళ్లలేని సందుల మధ్యలోకి కూడా మేము వెళ్లగలుగుతున్నాం. ఇళ్ల తాళాలు సరిగ్గా ఉన్నాయా? ఎవరైనా గోడల చాటున దాక్కున్నారా? వంటి సూక్ష్మ విషయాలను గమనించే అవకాశం ఉంది. కాలినడక గస్తీ ద్వారా అనుమానాస్పద కదలికలను త్వరగా గుర్తించగలుగుతున్నాం. దీంతో నేరాలను ముందుగానే అరికట్టే అవకాశం ఉంది.
కె. సాయికుమార్, కానిస్టేబుల్
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
Read Latest Telangana News and National News