తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
ABN , Publish Date - Mar 06 , 2026 | 04:28 AM
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన ప్రభుత్వం..
మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మ
బెంగాల్ గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి నియామకం
తమిళనాడు, హిమాచల్‌కు కూడా కొత్త గవర్నర్లు
ఢిల్లీ, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా మార్పు
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పలు రాష్ట్రాల గవర్నర్లు గురువారం బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి భవన్ గురువారం రాతిర పొద్దుపోయిన తర్వాత ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అలాగే, తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరణ్ జిత్ సంధూను నియమించారు. కాగా, త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మను 2024లో తెలంగాణ గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివప్రతాప్ శుక్లా.. ప్రధాని మోదీ తొలి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి హిమాచల్ గవర్నర్‌గా ఉన్న శుక్లాను ఇప్పుడు తెలంగాణకు బదిలీ చేశారు.
అమిత్‌షా ఒత్తిడి వల్లే ఆనంద్ బోస్ రాజీనామా : బెంగాల్ సీఎం మమత
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ గురువారం రాజీనామా చేయగా తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని ప్రభుత్వం బెంగాల్ గవర్నర్‌గా నియమించింది. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న వేళ జరిగిన ఈ మార్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా స్పందించారు. సీవీ ఆనంద్ బోస్ రాజీనామాపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మమత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి బెంగాల్ బాధ్యతలు అప్పగించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. కానీ, ఆర్‌ఎన్ రవి నియామకం అంశంలో కేంద్రం తమతో సంప్రదింపులు జరపలేదని విమర్శించారు. కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మమత మండిపడ్డారు. కాగా, 2022 నవంబరు 17న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ బోస్ మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మరోపక్క, తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా దూరం పెరిగింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ తమిళనాడులోని అధికార పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే ఆర్‌ఎన్ రవికి బెంగాల్ బాధ్యతలు అప్పగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.