Share News

రూ. 3,500 నుంచి 4 వేలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 10:13 AM

హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ దొరికినా కొన్ని ప్రాంతాల్లో రూ. 4 వేలకు, మరికొన్ని ప్రాంతాల్లో రూ. 3,500కు విక్రయిస్తున్నారు.

రూ. 3,500 నుంచి 4 వేలు

  • కమర్షియల్‌ సిలిండర్‌ ధరకు రెక్కలు

  • నగరంలో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేత

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. ఒకవేళ దొరికినా కొన్ని ప్రాంతాల్లో రూ. 4 వేలకు, మరికొన్ని ప్రాంతాల్లో రూ. 3,500కు విక్రయిస్తున్నారు. 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర సాధారణంగా రూ.2105ల వరకు ఉంది. ప్యారడైజ్‌ వద్ద గల నవరతన్‌ ఎంటర్ర్పైజెస్‌ (ఇండేన్‌ గ్యాస్‌) ఏజెన్సీలో 26వేల డొమెస్టిక్‌ కనెక్షన్లు, 600 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రోజుకు 500 సిలిండర్లను సప్లయ్‌ చేస్తుండగా బుధవారం 200 మాత్రమే సప్లయ్‌ చేశారు. బుధవారం కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా పూర్తిగా బంద్‌ అయింది. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కూడా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను నిలిపివేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.


మూత పడుతున్న హోటల్స్‌

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా లేకపోవడం, మార్కెట్‌లో అధిక ధర ఉండడంతో కొనుగోలు చేయలేక పలు హోటల్స్‌ మూత పడుతున్నాయి. మహమ్మద్‌గూడాలో ఓ హోటల్లో సిలిండర్‌ కొరతతో మూసేస్తున్నట్లు యజమాని ప్రకటించారు. అవసరమైతే అవసరమైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తామని చెప్పారు. పద్మారావునగర్‌లోని టిఫిన్‌ సెంటర్‌లో కమర్షియల్‌ సిలిండర్‌ సరఫరా లేకపోవడంతో హోటల్‌ మూసివేస్తున్నట్లు నిర్వాహకుడు తెలిపారు. టిఫిన్‌ సెంటర్‌ బందు చేసుకోవాల్సి వస్తదేమోనని బొల్లారంలోని స్ర్టీట్‌ టిఫన్‌ సెంటర్‌ యజమాని ఆందోళన చెందారు. అఫ్జల్‌గంజ్‌, బేగంబజార్‌లో కొన్ని టిఫిన్‌ సెంటర్లలో గ్యాస్‌ లేకపోవడంతో మూసేస్తున్నారు. వేల రూపాయలు పెట్టి సిలిండర్‌ కొనుగోలు చేసి వ్యాపారం ఎలా చేస్తామని చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలో గ్యాస్‌ కొరతతో హోటల్‌ మాస్టర్స్‌ బిర్యానీ మూతపడింది.


city6.jpgబావర్చి హోటల్‌ మూసివేత

ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని బావర్చి హోటల్‌ను బుధవారం మూసేశారు. గ్యాస్‌ సిలిండర్ల కొరత కారణంగానే మూసేసిన్నట్లుగా తెలిసింది. ప్రముఖ ప్యారడైజ్‌ హోటల్స్‌ అన్ని బ్రాంచీలలో టీ అమ్మకాలను నిలిపివేశారు. ఐటీసీ సంస్థ కూడా వివిధ ప్రాంతాల్లో గల సంస్థ హోటల్స్‌లో గ్యాస్‌ కొరత కారణంగా లంచ్‌, డిన్నర్‌ ఉండదని ప్రకటించింది.

డొమెస్టిక్‌ సిలిండర్ల వినియోగం

పలు ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు దొరక్కపోవడంతో టీ షాపులు, బండి వ్యాపారులు, టిఫిన్‌ సెంటర్ల నిర్వహకులు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను వాడుతున్నారు. కొందరూ గృహ వినియోగదారులు 14కిలోల గ్యాస్‌ సిలిండర్‌ను రూ.1800ల వరకు అమ్ముతున్నారు.


దుర్వినియోగం చేస్తే చర్యలు

వంటగ్యాస్‌ సిలిండర్ల సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె. శ్రీనివాస్‌ తెలిపారు. సిలిండర్లను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయిల్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. నెలకు ఒక సిలిండర్‌ బుకింగ్‌ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

జిల్లాలో సిలిండర్ల వివరాలు

పౌరసరఫరాల శాఖ అధికారుల లెక్క ప్రకారం జిల్లాలో ఐఓసీ, హెచ్‌పీ, బీపీసీఎల్‌కు చెందిన67 ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్లు 18,61,931, వాణిజ్య సిలిండర్లు 19,149 ఉన్నాయి.


నిలిచిన బుకింగ్‌ సేవలు

గ్రేటర్‌ పరిధిలో మూడు, నాలుగు రోజులుగా సిలిండర్ల బుకింగ్‌ కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సర్వర్‌ డౌన్‌తో బుకింగ్‌ కావడం లేదంటున్నారు. వాట్సాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం ఉన్నా కావడం లేదంటున్నారు.

రూ. 5 భోజనానికి ఇబ్బంది ఉండదు

గ్యాస్‌ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. గృహావసరాల సిలిండర్ల సరఫరా తగ్గింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే రూ.5 భోజనానికి ఇబ్బంది ఉండదని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.విద్యుత్‌తో నడిచే యంత్రాలతో భోజనం తయారు చేస్తున్న దృష్ట్యా గ్యాస్‌ కొరత ప్రభావం తయారీపై ఉండబోదని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.


ప్రత్యామ్నాయ మార్గాల వెతుకులాట

సిలిండర్లకు ప్రత్యామ్నాయ మర్గాలను నిర్వాహకులు ఆన్వేషిస్తున్నారని అమీర్‌పేట హాస్టళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజారావు చెబుతున్నారు. బుధవారం అమీర్‌పేట ప్రాంతంలోని హాస్టల్‌ నిర్వాహకులు 120కుపైగా ఎలక్ట్రికల్‌ స్టౌలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు కట్టెల పొయ్యి ఏర్పాటుచేసుకున్నారని దుర్గానగర్‌ హాస్టళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌ చెప్పారు. గ్యాస్‌ కొరత నేపథ్యంలో హాస్టళ్ల యజమానులంతా ఒక్కటయ్యారు. నిర్వహణ విషయంలో తాత్కాలిక నిబంధనలు రూపొందించి అమలుచేస్తున్నారు.


city6.2.jpg

హాస్టళ్ల నిర్వహణపై యజమానుల మల్లగుల్లాలు

విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం నగరానికి వచ్చిన యువతకు ఆశ్రయమిచ్చే పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) హాస్టళ్ల నిర్వహణ ఇప్పుడు మరింత భారంగా మారింది. నిర్వాహకుల నెత్తిన గ్యాస్‌ బండ పడింది. పశ్చిమాసియాలోని యుద్ధం పీజీ యజమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఓవైపు గ్యాస్‌ కొరతతో నగరంలోని పలు హోటళ్లను తాత్కాలికంగా మూసేస్తుంటే, మరోవైపు హాస్టళ్ల నిర్వహణపై యజమానులు మల్లగుల్లాలుపడుతున్నారు. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా బుధవారం నుంచి నగరంలో దాదాపుగా ఆగిపోవడంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారింది.


గ్యాస్‌ వినియోగం ఎక్కువ అయ్యే దోసె, పూరీ, చపాతీ వంటకాలను తాత్కాలికంగా అన్ని హాస్టళ్లలో నిలిపివేసినట్లు సమాచారం. గ్యాస్‌ కొరత తీరేవరకు అన్నం, సాంబారు, కూరతో సాధారణ భోజనాన్ని మాత్రమే అందించగలమని ఐటీకారిడార్‌లోని హాస్టల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. చికెన్‌, కోడిగుడ్డుకూర, వేపుళ్లు వంటి అదనపు వంటలను నిలుపుదలచేస్తున్నట్లు తెలిపారు. టీ, కాఫీ లాంటివాటిని అందించలేమని వెల్లడిస్తున్నారు.


గ్యాస్‌ కొరత నష్టాల్లోకి నెడుతుంది

మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కోర్సులు నేర్చుకోడానికి వచ్చే విద్యార్థుల సంఖ్య ఏడాదిగా బాగా తగ్గింది. దాంతో ప్రైవేటు హాస్టళ్ల వ్యాపారం మందకొండిగా నడుస్తోంది. గ్యాస్‌ కొరత మమ్మల్ని మరింత నష్టాల్లోకి నెడుతుంది. గతవారంలో అమీర్‌పేట బాపూనగర్‌ చుట్టుపక్కల 40కుపైగా హాస్టళ్లు మూతపడ్డాయి. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాం. హాస్టల్‌లో ఉంటున్నవారికి అన్నం, కూర, సాంబారైనా వడ్డించడానికి ప్రత్నిస్తున్నాం.

- రాజారావు, అమీర్‌పేట

హాస్టళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2026 | 10:59 AM