అతనికి అందిస్తున్నచికిత్సను నిలిపివేయొచ్చు!
ABN , Publish Date - Mar 12 , 2026 | 06:27 AM
దేశంలో తొలిసారి ఓ వ్యక్తి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ...
13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ కారుణ్య మరణానికి అంగీకరించిన సుప్రీంకోర్టు
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 4వ అంతస్తు నుంచి పడిపోయిన హరీశ్
తలకు గాయాలవడంతో కోమాలోకి..
కారుణ్య మరణానికి అనుమతించాలని సుప్రీంను ఆశ్రయించిన తల్లిదండ్రులు
న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో తొలిసారి ఓ వ్యక్తి కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అతని తల్లిదండ్రులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రాణాకు కృత్రిమ ప్రాణాధార వ్యవస్థతో అందిస్తున్న చికిత్సను నిలిపివేయొచ్చని పేర్కొంది. అతని కారుణ్య మరణానికి అనుమతి ఇస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీకి చెందిన హరీశ్‌రాణా(32) 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. నాలుగో అంతస్తు నుంచి కిందపడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. అప్పటినుంచి అతను కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్‌ను చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతని కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వైద్య నివేదికలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని అప్పుడు వారు కోర్టును వేడుకున్నారు. ఆ సందర్భంగా ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ‘‘వైద్య నివేదికల ప్రకారం.. గత 13 ఏళ్లుగా అతని ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. రోగిని కాపాడడమే వైద్యుల విధి. కానీ, రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు.. ఆ విధి నిర్వర్తించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ వ్యక్తి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా కృత్రిమ ప్రాణాధార చికిత్సను ఉపసంహరించుకునేలా ఎయిమ్స్ చూసుకుంటుంది. జీవితం, ప్రేమ, నష్టం ఇలా వీటన్నింటినీ పక్కనపెడితే.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం’’ అని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తీర్పులో వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చే సమయంలో జస్టిస్ పార్దీవాలా చలించిపోయారు. కాగా, దేశ చరిత్రలో కారుణ్య మరణానికి అంగీకరించడం ఇదే తొలిసారి.

ఇలాంటి పరిస్థితి ఎవరికీ
రాకూడదు: అశోక్ రాణా
సుప్రీం తీర్పు నేపథ్యంలో హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల చావును ఏ తల్లిదండ్రులూ కోరుకోరని, తమకు మాత్రం అలాంటి దుస్థితి వచ్చిందని వాపోయారు. ‘‘నా కొడుకు హరీశ్ చదువులో టాపర్. 13 ఏళ్లుగా దగ్గరుండి చూసుకుంటున్నాం. వాడి దుస్థితి చూడలేక రాష్ట్రపతి లేదా ప్రధానికి లేఖ రాద్దామని నాలుగేళ్ల కిందట నా భార్య అడిగింది. ఈ తీర్పు కోసం మేం మూడేళ్లుగా పోరాడుతున్నాం. కుమారుడికి ఇలా జరగాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకుంటారు? కానీ, మేమే వాడి కారుణ్య మరణం కోసం పోరాడాల్సి వచ్చింది. హరీశ్ లాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ, వాళ్లందరికీ ఈ తీర్పు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రుణపడి ఉంటాం’’ అని అశోక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం
స్పీకర్ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం