Share News

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

ABN , Publish Date - Mar 11 , 2026 | 08:30 PM

రాజ్యాంగ వ్యవస్థలను దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనుంది. విపక్ష 'ఇండియా' కూటమికి చెందిన 180 మంది ఎంపీలు ఇందుకు సంబంధించిన నోటీసుపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం
CEC Gyanesh Kumar

న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో దఫా బడ్జెట్ సమావేశాలు మరోసారి వేడెక్కనున్నాయి. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ (CEC Gyanesh Kumar)పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అభిశంసన తీర్మానం (Impeachment motion) ప్రవేశపెట్టనుంది. విపక్ష 'ఇండియా' కూటమికి చెందిన 180 మంది ఎంపీలు ఇందుకు సంబంధించిన నోటీసుపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిలో 120 మంది లోక్‌సభ ఎంపీలు, 60 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.


ప్రతిపాదిత అభిశంసన తీర్మానంలో సీఈసీపై తృణమూల్ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారనేది ఆయనపై మెదటి ఆరోపణ. మార్చి 10వ తేదీన సమావేశమయ్యేందుకు ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన టీఎంసీ నేతల పట్ల సీఈసీ అనుచితంగా ప్రవర్తించారనేది రెండో ఆరోపణ. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారనేది మూడో ఆరోపణ. అభిశంసన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టాలని, ఈనెల 12న కానీ, 13న కానీ నోటీసు సమర్పించాలని విపక్షాల యోచనగా ఉంది.


తొలి సీఈసీ

విపక్ష కూటమి తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అభిశంసన ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొంటున్న తొలి సీఈసీ కూడా జ్ఞానేశ్ కుమార్ అవుతారు. 1990లో అప్పటి సీఈసీ టీఎన్ శేషన్, 2006లో నవీన్ చావ్లాపై అభిశంసన తీర్మానం పెట్టాలనే చర్చలు జరిగినప్పటికీ అవి కార్యరూపంలోకి రాలేదు.


త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో హడావిడిగా పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడాన్ని మొదట్నించీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగాయంటూ ఈసీకి ఈవారం మొదట్లో టీఎంసీ లేఖ రాసింది. లక్షలాది మంది అర్హులైన ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించారని సీఎం ఆరోపించారు. ఎస్ఆర్ఐ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 28న ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 5,46,053 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది. దీనిపై మమతా బెనర్జీ నిరసనలకు దిగారు.


సీఈసీని అభిశంసించాలంటే...

కాగా, సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఉభయసభల్లో ఎక్కడైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సీఈసీ అభిశంసన విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల అభిశంసనకు అనుసరించే పద్ధతినే పాటిస్తారు. అభిశంసన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ కానీ, రాజ్యసభ చైర్మన్ కానీ తొలుత పరిశీలిస్తారు. ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆరోపణలను నిజమని కమిటీ నిర్ధారిస్తే అభిశంసన తీర్మానంపై ఉభయ సభల్లో ఓటింగ్ జరుపుతారు. ఓటింగ్‌కు హాజరయ్యే ఎంపీలలో మూడింట రెండు వంతుల మంది తీర్మానాన్ని బలపరచాలి. తీర్మానం ఆమోదం పొందితే సీఈసీని పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.


ఇవి కూడా చదవండి..

స్పీకర్‌ ఓంబిర్లాపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

స్పీకర్‌పై అవిశ్వాసం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు: కేంద్ర హోంమంత్రి

Updated Date - Mar 11 , 2026 | 08:38 PM