Share News

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:27 PM

హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా కీలక కామెంట్స్ చేశారు.

'కొడుకు మరణాన్ని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు?'.. హరీశ్ తండ్రి కీలక వ్యాఖ్యలు
Harish Rana

ఇంటర్నెట్ డెస్క్: హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగా తీర్పు చదివే సమయంలో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా భావోద్వేగానికి గురయ్యారు. 32 ఏళ్ల హరీశ్ రాణా సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉన్నాడు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా కీలక కామెంట్స్ చేశారు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ మరణాన్ని కోరుకోరని హరీష్ తండ్రి అశోక్ రాణా కన్నీరు పెట్టుకున్నారు.


ఓ జాతీయ మీడియాతో అశోక్ రాణా మాట్లాడుతూ..'మా బిడ్డ విషయంలో మేము కోరుకున్నది సాధించాము. నా బిడ్డకు కారుణ్య మరణానికి అనుమతించాలని నేను కొన్ని సంవత్సరాలుగా పోరాడాను. మా లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కొందరు తల్లిదండ్రులు కూడా తమ కొడుకు కోసం ఈ తీర్పును కోరుకుంటున్నారు?. హరీశ్ లాంటి స్థితిలో ఎంత మంది ఉన్నారో మాకు తెలియదు. సుప్రీంకోర్టు తీర్పు వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మా బిడ్డ కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లాము. చివరకు ఇవాళ మేము విజయం సాధించాము' అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.


అసలేం జరిగిందంటే...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. అతడు 2013 ఆగస్టు 20న హాస్టల్లో ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. అనేక ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా.. అతడి ఆరోగ్య పరిస్థితులో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు హరీశ్‌ను చూసుకుంటూ.. ఆర్థికంగా, మానసికంగా బాగా చితికిపోయారు. ఈ నేపథ్యంలో హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు రెండేళ్ల పోరాటం తర్వాత వారు విజయం సాధించారు.


ఇవి కూడా చదవండి:

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

హరీశ్ రాణా కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Updated Date - Mar 11 , 2026 | 05:33 PM