మహిళకు పునర్జన్మ ఇచ్చిన రోడ్డుపై గుంత.. ఎవ్వరూ ఊహించని అద్భుతం ఇది..
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:47 PM
రోడ్డుపై గుంత కారణంగా ఓ ప్రాణం నిలబడింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా రోడ్డుపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం రోడ్డుపై గుంత కారణంగా ఓ ప్రాణం నిలబడింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బరేలీకి చెందిన 50 ఏళ్ల వినీత శుక్లా అనే మహిళ కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబసభ్యులు ఆమెను బరేలీలోని ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి కోమాలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు వినీత బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఆమె బతికే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వినీత భర్త కుల్‌దీప్ కుమార్ శుక్లా చేసేది ఏమీ లేక ఆమెను ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఆమెను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళుతుండగా.. అంబులెన్స్ నేషనల్ హైవే 74పై ఓ పెద్ద గుంతలో పడి కుదుపునకు గురైంది. ఆ కుదుపు కారణంగా ఎవ్వరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. వినీతలో చలనం వచ్చింది. ఆమె కళ్లు తెరిచి భర్తను చూసింది.
భార్య కళ్లు తెరవటంతో కుల్‌దీప్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే భార్యను ఆస్పత్రికి తరలించాడు. చికిత్స తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది. ఈ సంఘటనపై కుల్‌దీప్ కుమార్ శుక్లా మాట్లాడుతూ.. ‘నేను ఇంటికి ఫోన్ చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోమని చెప్పాను. తను ఊపిరి కూడా తీసుకోవటం లేదు. నేను శోకసంద్రంలో మునిగిపోయాను. హఫీజ్‌గంజ్ దగ్గర అంబులెన్స్ పెద్ద గుంతలో పడి కుదుపునకు గురైంది. ఆ వెంటనే నా భార్య ఊపిరి తీసుకోవటం మొదలెట్టింది. నేను ఇంటికి ఫోన్ చేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయవద్దని చెప్పా. తర్వాత తనను పిలిభిత్‌లోని న్యూరోసిటీ ఆస్పత్రికి తీసుకెళ్లా’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి
తొమ్మిదేళ్ల క్రితమే బుమ్రా అద్భుతం చేశాడు.. 2017లో జస్ప్రీత్ చివరి ఓవర్ చూడండి..
ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న