Share News

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:30 PM

ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఏపీలో జరిగిన ఘటనలపై సీఎం ఆవేదన.. వారేం చేస్తున్నారంటూ ప్రశ్న
CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 11: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రారంభోపన్యాసంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బాణసంచా ప్రమాదం, శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి పాల కల్తీ ఘటనలు తనను బాధించాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని సీఎం తెలిపారు. ఇకపై కలెక్టర్లు, సెక్రటరీలు ఫీల్డ్ విజిట్స్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.


సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఇలాంటి ఘటనలు బాధాకరమని.. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. నీరు కలుషితం కావడం, పాలు కల్తీ చేయడం, బాణసంచా నిబంధనలు ఉల్లంఘన వంటి విషయాలపై సంబంధిత విభాగాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. స్వార్థపరుల చేతుల్లో పరిస్థితులు వెళ్లకుండా, ఉదాసీనతకు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


కలెక్టర్లు, సీనియర్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు కనీసం 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు ఫీల్డ్ విజిట్లు చేయాలని సూచించారు. ఇలాంటి పర్యటనల వివరాలను పోర్టల్‌లో తయారు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో కలెక్టర్లే అని.. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని సీఎం స్పష్టం చేశారు. ఏది వాస్తవమో అధ్యయనం చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అని పేర్కొన్నారు.


సంజీవని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్క్రీనింగ్‌లో 72 లక్షల మందికి వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలిందని అన్నారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, నిధులు కోల్పోయామని విమర్శించారు. పాత స్కీమ్‌ను రూ.28 వేల కోట్లను ఖర్చు చేసేలా 2028 వరకు పొడిగించారని.. ఇది సంతోషకరమని తెలిపారు. రెండేళ్లలో జేజేఎం పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికీ కుళాయి అందించాలని, స్థానిక నీటి వనరుల నుంచి నీటిని సరఫరా చేసేలా చూడాలని సూచించారు. పైప్‌లైన్ల కోసం రోడ్లు తవ్వి మళ్లీ సరిచేయకుండా వదిలేస్తున్నారని... ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిందే అని సీఎం ఆదేశించారు.


మ్యాజిక్ డ్రెయిన్లు వేగంగా పూర్తి చేయాలన్నారు సీఎం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ అందించే ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో ఇల్లు, ఇంటి జాగా అందించాలని.. ఉగాదికి 2.50 లక్షల మందికి, జూన్‌లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని ప్రకటించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు అమలులోకి వస్తున్నాయని తెలిపారు. ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ మార్చి 15 నుంచి ప్రారంభమవుతుందని, కనీసం 50 మున్సిపాలిటీలకు అవార్డులు రావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.


ఇవి కూడా చదవండి...

టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలు... కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 12:44 PM