Share News

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?

ABN , Publish Date - Mar 11 , 2026 | 01:37 PM

13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రమాదవశాత్తూ కిందపడి తలకు తీవ్ర గాయాలై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు కారుణ్య మరణానికి అనుమతించింది.

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి 'సుప్రీం' అనుమతి.. అసలేంటీ కేసు.?
Harish Rana Passive Euthanasia Case

ఇంటర్నెట్ డెస్క్: సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగా తీర్పు చదివే సమయంలో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అసలెవరీ హరీశ్ రాణా? ఏమిటీ కేసు.? దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్న హరీశ్ రాణా కేసు వివరాల్లోకెళితే...


ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. అతడు 2013 ఆగస్టు 20న హాస్టల్లో ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా.. అతడి హెల్త్ కండీషన్‌లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు హరీశ్‌ను చూసుకుంటూ.. ఆర్థికంగా, మానసికంగా బాగా చితికిపోయారు.


ఈ నేపథ్యంలో హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరీశ్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్(శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్(ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడా నిరాశే ఎదురైంది. హరీశ్‌ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి స్పష్టమైన నివేదికలు ఇవ్వడంతో.. వాటి ఆధారంగా మరోసారి వారు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హరీశ్ మెడికల్‌ రిపోర్ట్‌లను పరిశీలించిన న్యాయస్థానం.. అతడి కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ ఏడాది జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు.


సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం నాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి(పాసివ్ యూతనేషియా) అనుమతించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్లతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రాణాకు పాసివ్‌ యూతనేషియా(Passive Euthanasia) ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో 2018లో చట్టబద్దత తర్వాత దేశంలో పరోక్ష కారుణ్య మరణం జరిగిన తొలి కేసుగా నిలిచింది.


ఇవీ చదవండి:

మహిళకు పునర్జన్మ ఇచ్చిన రోడ్డుపై గుంత.. ఎవ్వరూ ఊహించని అద్భుతం ఇది..

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

Updated Date - Mar 11 , 2026 | 01:54 PM