గ్యాస్ సిలిం...డర్!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:17 AM
యుద్ధ ప్రభావాన్ని ప్రతివర్గం ఏదొక రూపంలో చవిచూస్తోంది. ఆగకుండా సాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్‌కు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంది.
‘ప్యానిక్ బుకింగ్స్’తో కొరత వాతావరణం.. యుద్ధం వేళ డొమెస్టిక్ గ్యాస్‌కు సమస్య రాకుండా అన్ని చర్యలు
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
యుద్ధ ప్రభావాన్ని ప్రతివర్గం ఏదొక రూపంలో చవిచూస్తోంది. ఆగకుండా సాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్‌కు కొరత ఏర్పడవచ్చునన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంది. గృహ వినియోగ గ్యాస్‌కు కొరతరాకుండా అన్ని ఏర్పా ట్లు చేసింది. అయినా, భయంతో గృహ వినియోగదారులు భారీగా ముందస్తు బుకింగ్‌ల కు ప్రయత్నిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పుడు ‘పానిక్ బుకింగ్స్’ పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ ప్రభావం ఐవీఆర్‌ఎస్(ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) బుకింగ్స్ మీద పడి, సర్వర్ స్తంభించిపోతోంది. పానిక్ బుకింగ్స్‌ను నియంత్రించడానికి కేంద్ర ప్రభు త్వం ఐవీఆర్‌ఎస్ సర్వర్‌ను స్లో డౌన్ చేసింద ని తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్యాస్ ఏజెన్సీలు కూడా అంగీకరిస్తున్నాయి.
నిబంధనలు కఠినతరం
బుకింగ్స్ విషయంలో పరిమితులు విధించారు. సింగిల్ సిలిండర్‌కు 21 రోజులు, డబుల్ సిలిండర్‌కు 30 రోజులు వేచి చూడా లి. 21 రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేస్తే .. రెండున్నర రోజుల్లో డెలివరీ చేసేలా తాజా గా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి, ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే, ఇప్పటిదాకా బుకింగ్ చేయగానే సిలిండరు ఇస్తున్నారు. ఇక ముందుమాత్రం కచ్చితమైన గడువు పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీల జిల్లా కో-ఆర్డినేటర్ల నుంచి డీలర్ల వరకు ఆదేశాలు జారీచేశారు. దీనిపై కో ఆర్డినేటర్లను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలన్నింటి పరిధిలో 1.59 కోట్ల మేర ఎల్‌పీజీ డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ఏ వినియోగదారుడికీ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు.
నిల్వలు మరో రెండు రోజులే..
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల నిల్వలు తగ్గిపోతున్నాయి. మూడు రోజులుగా ఆయిల్ కంపెనీల నుం చి సరఫరా నిలిచిపోవడంంతో ఒక్కో డీలర్ దగ్గర సగటున 40-50 మధ్యలోనే కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. ఇవి 2 రోజుల వరకే వస్తాయి. ఈ క్రమంలో అధికారులు నిబంధనలను గట్టిగా అమలు చేస్తున్నారు. విజయవాడలో స్టార్ హోటల్స్ నిర్వాహకులు పైపుగ్యాస్ వినియోగించడం వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. బడ్జెట్ హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కట్టెలను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. స్ర్టీట్ ఫుడ్ నిర్వాహకులకు ఆ అవకాశం లేదు. 3 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేసిన కంపెనీలు, తాజాగా విద్యాసంస్థలు, ఆస్పత్రులకు మాత్రమే సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి. అత్యవసర కేటగిరీలో ఇంకా ఏమైనా ఉంటే.. కంపెనీల దృష్టికి తీసుకురావచ్చని చెప్పినట్టు ఉమ్మడి కృష్ణాజిల్లా ఆయిల్ కోఆర్డినేటర్ రాజశేఖర్ ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
దాచిన సిలిండర్లు స్వాధీనం
గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా నిల్వచేసిన వారిపై పౌర సరఫరాల అధికారులు దాడులు ప్రారంభించారు. విజయవాడలోని పలు హోటళ్లలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. మధురానగర్‌లోని ఓ హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హోటళ్ల తనిఖీలు జరిగాయి.
పెళ్లిళ్లకు కట్టెల పొయ్యిలపై వంటకాలు
గొల్లప్రోలు: పెళ్లిళ్ల సీజన్‌లో ఘుమఘుమలతో నిండాల్సిన వంటశాలలు పొగ చూరుతున్నాయి. సాధారణంగా పెళ్లిళ్లల్లో అన్ని రకాల వంటకాలను గ్యాస్ స్టవ్‌లపై తయా రు చేస్తుంటారు. అయితే, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అంక్షలు రావడం, వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో, కట్టెల పొయ్యిలు ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని ఓ కమ్యూనిటీ హాలులో బుధవారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఆరుబయట కట్టెల పొయ్యిలు వేసి వంటలు పూర్తి చేశారు.
రెస్టారెంట్లకు ప్రతి సోమవారం సెలవు
స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి వెల్లడి
గ్యాస్ సిలిండర్ల కొరతతో రాష్ట్రంలోని హోటళ్ల నిర్వహణ భా రంగా మారిందని ఏపీ స్టార్ హోటల్స్ సంఘం అధ్యక్షుడు ఆర్వీ స్వామి మీడియాకు వెల్లడించారు. ‘‘గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో హోటళ్లు నడపడం కష్టంగా మారింది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలని నిర్ణయించాం. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్‌లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తాం. ప్రతి సోమవారం రెస్టారెంట్‌లకు వీక్లీ హాలిడే ప్రకటిస్తాం. కర్ణాటక తరహాలో హోటళ్లలో కేవలం టీ, కాఫీలే విక్రయించే పరిస్థితి ఏపీకి రాబోతుంది. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని తెలిపారు.