మూసీ ప్రాజెక్టు ఆవిష్కరణను నిలిపివేయండి
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:34 AM
ఈనెల 13న చేపట్టనున్న మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెట్స్...
సీఎం రేవంత్‌కు మేధా పాట్కర్ లేఖ
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల 13న చేపట్టనున్న మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెట్స్ (ఎన్‌ఏపీఎం) నిర్వాహకురాలు మేధా పాట్కర్ డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రజాస్వామ్యబద్ధంగా సంప్రదింపులు జరపాలని కోరుతూ సీఎంకు ఆమె ప్రత్యేకంగా లేఖ రాశారు. మూసీ ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకంగా అమలు చేయాలని కోరారు. మూసీనది తీరప్రాంత ప్రజల హక్కుల కోసం ఏర్పడిన ‘మూసీజన ఆందోళన్ ’ తరఫున ఈలేఖ పంపినట్లు ఆమె తెలిపారు. ఈ లేఖ ప్రతులను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపినట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు, పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు వంటి కీలక వర్గాల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం కేవలం ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రాజెక్టు ప్రణాళికను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో విడుదల చేసి కనీసం 60 రోజుల పాటు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు. ప్రభావిత ప్రాంత ప్రజలు, నిపుణులతో కలిసి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజా విచారణ జరపాలన్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని భూసేకరణ నోటీసులను ఉపసంహరించుకోవాలని, 2017లో చేసిన భూసేకరణ చట్ట సవరణలను రద్దుచేసి 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.