Share News

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

ABN , Publish Date - Jan 03 , 2026 | 09:05 PM

తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు.

CM Revanth Reddy: ఎమ్మెల్యేల ప్రవర్తనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ(శనివారం) అసెంబ్లీలో ‘నీళ్లు - నిజాలు’పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో పలువురు ఎమ్మెల్యేలు సభలో ఉండకుండా లాబీల్లో తిరగడంపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు. ప్రభుత్వం కీలక అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న సమయంలో.. కొందరు ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఇది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమనిపేర్కొన్నారు. ప్రజలు అసెంబ్లీ సమావేశాలను గమనిస్తున్న వేళ ఎమ్మెల్యేలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సభలో లేని ఎమ్మెల్యేల తీరు.. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలపై చర్చ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సభలో ఉండాలని, ప్రజలకు జవాబుదారీతనం చూపించాల్సిన అవసరం ఉందని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విప్‌లకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే లాబీల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సభలోకి పిలిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విప్‌లను ఆదేశించారు. శాసనసభలో క్రమశిక్షణ, హాజరు తప్పనిసరని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు ప్రజల ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని సీఎం గుర్తు చేశారు. అలాంటి సమయంలో సభకు దూరంగా ఎమ్మెల్యేలు ఉండటం సరైన పద్ధతి కాదని చెప్పుకొచ్చారు. ప్రతి ఎమ్మెల్యే పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారుడుగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 10:20 PM