ఎల్‌నినోపై విమర్శలు విడ్డూరం
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:12 AM
వంద దేశాలపై ప్రభావం చూపుతున్న సూపర్ ఎల్‌నినో’ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శించడం విడ్డూరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
రాజకీయాలకతీతంగా విపక్షాలు సహకరించాలి
ప్రజల్లో అవగాహనతోపాటు నీరు, విద్యుత్ పొదుపునకు చర్యలు: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వంద దేశాలపై ప్రభావం చూపుతున్న సూపర్ ఎల్‌నినో’ను కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శించడం విడ్డూరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయకుండా సలహాలు, సూచనలతో సర్కారుకు సహకరించాలని హితవు చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన భట్టి.. అటుపై కొదుమూరులో మీడియాతో మాట్లాడారు. కరోనా వేళ మాదిరే ఎల్‌నినో విపత్తును ఎదుర్కొనేందుకు పార్టీలకతీతంగా సహకరించాలని విపక్షాలను కోరారు. అసెంబ్లీ సాక్షిగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విపక్షంగా కాంగ్రెస్ ఎన్నో సలహాలు, సూచనలిచ్చిందని, విపక్ష నేతగా తన సూచనలను గుర్తు చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఎల్‌నినో విపత్కర పరిస్థితులతో లండన్‌లో విద్యుత్, నీటిపొదుపు చర్యలు చేపట్టారన్నారు.
తమ ప్రభుత్వమూ దీనిపై ప్రజల్లో చైతన్యం తేవడంతోపాటు నీటి వనరుల సద్వినియోగం, విద్యుత్ వృథా నివారణ, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చెరువులు, కుంటలు, జలాశయాల్లోని నీటి నిల్వలను తాగునీటి అవసరాలకు సక్రమంగా వినియోగించాలన్న భట్టి.. ఇందుకు సిద్ధం చేసిన ముందస్తు ప్రణాళిక అమలుకు సమష్టి కార్యాచరణ ఎంతో అవసరమన్నారు. ఆహార ధాన్యాల కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. బాగా పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
2014లో 6,648 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే, ప్రస్తుతం 20,018 మెగావాట్లకు పెరిగిందన్నారు. ప్రతిఏటా 6.5 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగితే, ఈ ఏడాది అక్టోబరులో 37 శాతం ఎక్కువైందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేస్తుండగా, 15 లక్షల పంపుసెట్లకు భూగర్భ జలాల కొరత నెలకొందని చెప్పారు. ఇటు 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జలాశయాల్లో నీటి కొరత వల్ల 3,500 నుంచి 4 వేల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. వ్యవసాయ పనుల్లేనందు వల్ల ఉపాధి కల్పనపై దృష్టి పెట్టామని, ఇప్పటికే 9.1 లక్షల ఉపాధి పనులు గుర్తించగా, అదనంగా మరో 8 లక్షల పనులకు అనుమతినిచ్చామని ఆయన వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News