Share News

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:24 AM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకే భారత్‌ సమ్మిట్‌ 2.0ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్‌ సమ్మిట్‌ 2.0
Bhatti Vikramarka

  • సదస్సులో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై చర్చలు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

  • భారత్‌ సమ్మిట్‌ రాజకీయాల కోసం కాదు: మంత్రి శ్రీధర్‌ బాబు

  • సమ్మిట్‌ విజయానికి అందరూ సహకరించాలి: మహేష్‌ కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు11(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హింస, విద్వేష రాజకీయాలు, విభజన ధోరణుల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకే భారత్‌ సమ్మిట్‌ 2.0ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నవంబరు 12, 13, 14 తేదీల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి భట్టి తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య వాదులు, ఉదారవాదులు, ప్రగతిశీల భావాలు కలిగినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ప్రపంచానికి నూతన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని భట్టి విక్రమార్క అన్నారు.


భారత్‌ సమ్మిట్‌ 2.0లో పాల్గొనేందుకు 70కిపైగా దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు, విధాన నిర్ణేతలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు అంగీకారం తెలిపారని వెల్లడించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలక స్తంభాలని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్ష పార్టీలను, నాయకులను శత్రువులుగా చూడకూడదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలని సూచించారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా చూస్తున్నారని, వాటిని, వాటి నాయకత్వాన్ని రాజకీయంగా అంతం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కును తొలగించే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. దేశంలో ఓటు హక్కును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రతి పౌరుడి తరఫున కాంగ్రెస్‌ మాట్లాడుతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక, భారత్‌ సమ్మిట్‌ రాజకీయాల కోసం నిర్వహిస్తున్నది కాదని, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలన్నదే లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని రీ లాంచ్‌ చేయడానికే భారత్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారంటూ బీజేపీ నేతల చేస్తోన్న వ్యాఖ్యలను శ్రీధర్‌బాబు ఖండించారు.


అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన రాహుల్‌ గాంధీని ప్రత్యేకంగా లాంచ్‌ చేయాల్సిన అవసరం లేదని, మోదీ తర్వాత ఎవరిని లాంచ్‌ చేయాలని బీజేపీ ఆలోచిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్‌ సమ్మిట్‌లో యువత, సాంకేతికత తదితర అనేక అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. కాగా, భారత్‌ సమ్మిట్‌ విజయానికి అందరూ సహకరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధి తదితర అంశాలపై చర్చలకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుందన్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, అందుకే కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం రాష్ట్రంలో రెండో సారి ఈ సదస్సు నిర్వహణకు సహకారం అందించిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు. భవిష్యత్తులో ఈ సదస్సు హైదరాబాద్‌లో శాశ్వత కార్యక్రమంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐసీసీ అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌చార్జి గురుదీప్‌ సింగ్‌ సప్పల్‌, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సమృద్థ భారత్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ పుష్పరాజ్‌ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు

ముస్లిం రిజర్వేషన్లను తొలగించేవాడు ఇంకా పుట్టలేదు

వరి పంట తప్ప..!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 04:24 AM