Share News

ఆ నిధులపై అనుమానాలున్నాయి.. విచారణ జరపండి: బండి సంజయ్

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:00 AM

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఆ నిధులపై అనుమానాలున్నాయి.. విచారణ జరపండి: బండి సంజయ్
Bandi Sanjay Kumar

హైదరాబాద్, జులై 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై అనేక అనుమానాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా నిధులను వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేయాలంటూ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.


పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలి..

ఈ నిధుల వినియోగంపై అనేక అనుమానాలు, ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్కకు లేఖ రాశారు.


అధికారులు ఒత్తిడి తెస్తున్నారు..

కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని బండి సంజయ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఖర్చు చేయాలంటూ అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పలువురు సర్పంచులు తనకు అందజేసిన ఫిర్యాదులను కేంద్ర, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా కొన్ని పంచాయతీల్లో నిధులను ఖర్చు చేసిన అంశాలకు సంబంధించిన ఆధారాలను సైతం లేఖతోపాటు జత చేసి పంపారు.


గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం..

గ్రామీణ ప్రజాస్వామ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థే పునాది అని బండి సంజయ్ గుర్తు చేశారు. ఈ వ్యవస్థలో నిధుల వినియోగంలో నిబంధనలను ఉల్లంఘిస్తే గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయా మంత్రులను కోరారు. సర్పంచులు చేసిన ఫిర్యాదులు, తనకు అందించిన ఆధారాలను దృష్టిలో ఉంచుకుని నిష్పాక్షిక విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయా మంత్రులను బండి సంజయ్ కోరారు.


వార్తలు కూడా చదవండి...

‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క

హైడ్రాపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 10:51 AM