2 వేల మంది.. దుబాయ్‌లో చిక్కుకున్న హైదరాబాదీయులు
ABN , Publish Date - Mar 03 , 2026 | 09:46 AM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో మూతపడిన ఎయిర్‌పోర్ట్
రెండు రోజులుగా 24,400మంది భారతీయుల పడిగాపులు
ఎట్టకేలకు సోమవారం రాత్రి ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ
చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాల టేకాఫ్
హైదరాబాద్ ఫ్లైట్ రద్దు .. నగర కుటుంబీకుల్లో భయాందోళన
క్యాన్సిల్‌కు విజ్ఞప్తి.. కొందరికి రీషెడ్యూల్.. మరికొందరికి రీఫండ్
హైదరాబాద్ సిటీ: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నగరవాసులను కూడ వణికిస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకున్నారు. వీరిలో సుమారు 2వేల మంది హైదరాబాదీయులే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. దీంతో ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించారు. భారత్‌కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై(Chennai, Bangalore, Delhi, Mumbai) విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్‌ను రద్దు చేసింది. ప్రయాణికులను తిరిగి హోటల్‌కు తరలిస్తున్నట్లు ఓ ప్రయాణికుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
రోజూ 1400-1500మంది..
దుబాయి పర్యాటకం ప్రత్యేక అనుభూతిని కల్పిస్తుంది. నగరానికి చెందిన చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు తెలిసింది. ఇందులో 50-60శాతం మంది టూరిస్టులే ఉన్నారు. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజు 5-6 విమానాలు నేరుగా వెళుతుండగా.. 15 వరకు కనెక్టింగ్ విమానాలున్నాయి. రోజుకు సగటున 1400-1500 మంది వెళ్తుంటారు.
తగ్గిన బుకింగ్‌లు..
నగరంలో సుమారు 1801 ట్రావెల్ ఏజెన్సీలున్నాయి. ఇందులో 123 పేరొందిన సంస్థలున్నాయి. గల్ఫ్‌లో యుద్ధం జరుగుతుండడంతో దుబాయికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దుబాయితోపాటు ఇతర దేశాల ప్రయాణాలకు కూడా ఎవరూ ఇష్టపడడంలేదని వారు పేర్కొంటున్నారు.
ప్రయాణాల రీషెడ్యూల్.. రీఫండ్..!
మార్చిలో ప్రయాణించేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. యుద్ధ భయంతో అక్కడికి వెళ్లలేమని చెబుతూ డబ్బులు రీఫండ్ చేయాలని ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో నిర్వాహకులు కొందరికి సర్దిచెబుతూ వారు కోరిన విధంగా ఇతర తేదీల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు. మరికొందరికి డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. కాగా, డబ్బులు ఇవ్వలేని సంస్థలు వారికి మరికొన్ని ఇతర ఆఫర్లను ప్రకటిస్తున్నారు. వివిధ దేశాలు, భారతదేశంలోని ఇతర రాష్ర్టాల్లోని పర్యాటకాన్ని సందర్శించేందుకు వీలు కల్పిస్తున్నారు. మొత్తంగా ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ జరుగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ పర్యాటకంపై భారీగా పడిందని పలువురు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News