Share News

రసాయన రంగులు వాడితే చర్యలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 08:39 AM

హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే వాడాలని, రసాయనాలతో కూడిన రంగులను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు.

రసాయన రంగులు వాడితే చర్యలు

  • హోలీ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు

  • గుంపులుగా తిరుగుతూ నూసెన్స్‌ చేస్తే వాహనాలు సీజ్‌ చేస్తాం

  • సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ: హోలీ వేడుకల్లో సహజసిద్ధమైన రంగులనే వాడాలని, రసాయనాలతో కూడిన రంగులను వాడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌(CP Sajjanar) హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి సోమవారం పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పండగపూట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజిబుల్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బ్లూ కోట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలన్నారు.


హోలీ ఆడటం ఇష్టం లేనివారిపై బలవంతంగా రంగులు పూయొద్దని ప్రజలకు సూచించారు. బహిరంగ ప్రదేశాలు, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లొద్దని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు నగర వ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందన్నారు. వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని చెప్పారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్‌ చేస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. రంజాన్‌ మాసం నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సీపీ సూచించారు.


city4.2.jpgనేడు మద్యం షాపులు తెరవద్దు

హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తెరవద్దన్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై సిటీ పోలీస్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ శ్వేత ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, డీసీపీలు ఖారే కిరణ్‌ ప్రభాకర్‌, రూపేశ్‌, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హోలీ హంగామా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 03 , 2026 | 08:39 AM