Share News

హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్ల జామ్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:44 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని జీపీఎస్‌ జామింగ్‌, సిగ్నల్‌ స్పూఫింగ్‌ అనే డిజిటల్‌ పొగమంచు కమ్మేసింది! పర్షియన్‌ గల్ఫ్‌ను......

హోర్ముజ్‌ జలసంధిలో ట్యాంకర్ల జామ్‌

శత్రువుల క్షిపణులు, డ్రోన్లను నిర్వీర్యం చేయడానికి ఎలకా్ట్రనిక్‌ రక్షణ కవచాన్ని యాక్టివేట్‌ చేసిన ఇరాన్‌

డిజిటల్‌ చీకటిలో చిక్కుకున్న 1100కుపైగా నౌకలు

దారి తప్పుతున్న ఆయిల్‌ ట్యాంకర్లు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని జీపీఎస్‌ జామింగ్‌, సిగ్నల్‌ స్పూఫింగ్‌ అనే డిజిటల్‌ పొగమంచు కమ్మేసింది! పర్షియన్‌ గల్ఫ్‌ను, ఓమన్‌ గల్ఫ్‌ను కలుపుతూ ఇరుగ్గా ఉండే ఈ సముద్రమార్గం ఇప్పుడు ఎలకా్ట్రనిక్‌ రణభూమిగా మారింది. ఫలితంగా.. ఆ దారిలో భారీస్థాయిలో ట్యాంకర్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. 1100కు పైగా నౌకలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి! ఆ దారిలో ప్రయాణిస్తున్న నౌకల కెప్టెన్లు.. తమ నేవిగేషన్‌ వ్యవస్థలు తప్పుడు స్థానాలను చూపుతున్నాయని చెబుతున్నారు. నౌకలు సముద్రంలో కాకుండా ఎడారిలో ఉన్నట్టు.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లంగరు వేసినట్టు కనిపిస్తోందని వారు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇది సుదీర్ఘకాలం ఇలాగే మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అందుకే దీన్ని ‘స్ట్రాటజిక్‌ చోక్‌ పాయింట్‌’గా వ్యవహరిస్తుంటారు. భారీ ఆయిల్‌ ట్యాంకర్లను మోసుకుంటూ ఈ మార్గంలో నిదానంగా కదిలే నౌకలకు దారి చూపించేది ఉపగ్రహ సంకేతాలే. ఆ నౌకల లొకేషన్‌ను గుర్తించడానికి జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌)ను, తమ ఉనికిని ఇతరులకు చేరవేయడానికి ఏఐఎస్‌ (ఆటోమ్యాటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌)ను వినియోగించుకుంటాయి. అయితే, ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్‌ తమపై యుద్ధానికి దిగడంతో ఆ దేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధవిమానాల నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇరాన్‌ ఈ ప్రాంతంలో తన ఎలకా్ట్రనిక్‌ రక్షణ కవచాన్ని ఉత్తేజితం చేయడమే.. హోర్ముజ్‌ జలసంధిలో నౌకల ప్రస్తుత దుస్థితికి కారణం.


ఆ రెండూ..

ఇరాన్‌ యాక్టివేట్‌ చేసిన ఎలక్ట్రానిక్ కవచంలో ప్రధానమైనవి రెండు వ్యవస్థలు.. ఒకటి సయ్యాద్‌ 4, రెండోది కోబ్రా వీ8. ఈ రెండింటినీ.. హోర్మజ్‌ జలసంధికి అత్యంత సమీపంలో ఉన్న తన ‘బందర్‌ అబ్బాస్‌’ నౌకాదళ స్థావరంలో ఇరాన్‌ మోహరించింది. వీటిలో.. సయ్యాద్‌ 4 క్షిపణి, నిఘా వ్యవస్థ. అమెరికా వద్ద ఉన్న స్టెల్త్‌ సామర్థ్యం గల విమానాలను రేడార్‌ ద్వారా గుర్తించడం కష్టం. కానీ, తమవద్ద ఉన్న ఈ సయ్యాద్‌ 4 వ్యవస్థకు పాసివ్‌ రేడార్‌ సామర్థ్యం ఉందని ఇరాన్‌ చెబుతోంది. ఈ పాసివ్‌ రేడార్లు ఎలాంటి సంకేతాలనూ విడుదల చేయవు. అవి కేవలం వాతావరణంలో అప్పటికే ఉన్న మొబైల్‌, టీవీ, రేడియో సిగ్నల్స్‌ను గమనిస్తూ ఉంటాయి. స్టెల్త్‌ యుద్ధవిమానాలు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు అవి వెళ్లే మార్గంలో అక్కడ ఉన్న వైఫై, రేడియో తరంగాలలో చిన్నపాటి అలజడులను సృష్టిస్తుంటాయి. సయ్యాద్‌-4 సెన్సర్లు ఆ అలజడులను పసిగట్టి, ఆకాశంలో ఆ స్టెల్త్‌ యుద్ధవిమానం ఎక్కడుందో గుర్తిస్తాయి. అలా వాటిని గుర్తించాక, వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం కాకుండా.. రేడియో తరంగాలతో వాటిని కూలిపోయేలా, దారిమళ్లేలా, శత్రువుల సెన్సర్ల సర్క్యూట్లు పూర్తిగా మొరాయించేలా చేస్తాయి. అందుకే ‘సయ్యాద్‌-4’ వ్యవస్థకు ‘నిశ్శబ్ద వేటగాడు’ అనే పేరుంది. ఇక, కోబ్రా వీ8ను ఒక డిజిటల్‌ గోడగా అభివర్ణించవచ్చు. ఒక మొబైల్‌ ట్రక్కుపై ఉండే ఈ వ్యవస్థ.. శత్రువుల విమానాలు, డ్రోన్లు, యుద్ధనౌకలు ఉపయోగించే రేడియోతరంగాలను పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాదాపు 250 కిలోమీటర్ల పరిధిలో డిజిటల్‌ చీకటిని సృష్టిస్తుంది. ‘రేడార్‌ బ్లైండింగ్‌’ ద్వారా.. శత్రువుల రేడార్‌ స్ర్కీన్లపై వేలకొద్దీ తప్పుడు టార్గెట్లను సృష్టిస్తుంది. దీనివల్ల ఇరాన్‌కు చెందిన అసలైన యుద్ధవిమానమేదో శత్రువులు గుర్తించలేరు. నేవిగేషన్‌ కంప్యూటర్లను మోసం చేసి, డిజిటల్‌ అంధులుగా మార్చి అవి తప్పుడు మార్గంలో వెళ్లేలా చేస్తుంది. అయితే, ఈ కోబ్రా వీ8 కారణంగా జీపీఎస్‌ జామ్‌ అవడం వల్ల ఈ 250 కిలోమీటర్ల పరిధిలో పౌర విమానాల నేవిగేషన్‌ దెబ్బతింటోంది. హోర్ముజ్‌ జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్లు ఒకదాన్నొకటి ఢీకొనే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాగే నౌకల రాకపోకలు ఎక్కువకాలం ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే ఆ ప్రభావం కనపడుతోంది. చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Mar 03 , 2026 | 04:44 AM