Share News

రోడ్లపై నిర్మాణ సామగ్రి ఉంటే జరిమానా

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:19 AM

రోడ్లపై ఇసుక, కంకర, స్టీల్‌ వేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇష్టారాజ్యంగా రహదారులపై భవన నిర్మాణ సామగ్రి వేసే వారిపై చర్యలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.

రోడ్లపై నిర్మాణ సామగ్రి ఉంటే జరిమానా
GHMC

  • చెత్త వేసినా చర్యలు

  • మొబైల్‌ సీసీ కెమెరాలతో నిఘా

  • గోల్కొండ జోన్‌లో అమలులోకి

హైదరాబాద్‌ సిటీ: రోడ్లపై ఇసుక, కంకర, స్టీల్‌ వేస్తున్నారా? అయితే జాగ్రత్త. ఇష్టారాజ్యంగా రహదారులపై భవన నిర్మాణ సామగ్రి వేసే వారిపై చర్యలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇందుకోసం సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌తో కూడిన ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. గోల్కొండ జోన్‌లోని మాసబ్‌ట్యాంక్‌ సర్కిల్‌లో రెండు వాహనాలు అద్దెకు తీసుకునేందుకు మంగళవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. 360 డిగ్రీస్‌లో పనిచేసే కెమెరా, దానిని ఆపరేట్‌ చేసేందుకు టెక్నీషియన్‌, వాహనం డ్రైవర్‌ వంటివి ఎంపికైన ఏజెన్సీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. బస్తీలు, కాలనీల్లో రోడ్లపై ఇసుక, కంకర, ఇటుకలు, స్టీల్‌, ఇతర సామగ్రి ఇష్టారాజ్యంగా వేస్తున్నారన్న ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీకి అధికంగా వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.


ఈ క్రమంలో నిబంధనల అమలులో భాగంగా ప్రత్యేక నిఘా కొనసాగించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఒక్కో వాహనం, సాంకేతిక పరికరాలు, సిబ్బంది ఏర్పాటు నేపథ్యంలో ఏటా రూ.37.55 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. నిర్ణీత ప్రాంతాల్లో తిరిగే వాహనంలో జీహెచ్‌ఎంసీకి చెందిన రెగ్యులర్‌ ఉద్యోగి ఒకరు ఉంటారు. రోడ్లపై ఉన్న సామగ్రిని గుర్తించి.. రూ.5 వేల నుంచి రూ.50 వేలు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ జరిమానా విధించనున్నారు. రహదారిపై పూర్తిగా సామగ్రి ఉన్న పక్షంలో వాటిని తొలగిస్తామని ఓ అధికారి చెప్పారు.


city3.2.jpgచెత్త వేయకుండా..

గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్ల (జీవీపీ) తొలగింపుపైనా బల్దియా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రోడ్ల పక్కన చెత్త వేయకుండా నియంత్రించేందుకూ ఈ వాహనాన్ని వినియోగించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశుధ్య నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో వాహనం పని చేయనుంది. నిర్ణీత ప్రాంతాల్లో సంచరిస్తూ చెత్త వేసే వారికి జరిమానా విధించనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణ ప్రణాళికా విభాగం వాహనాన్ని వినియోగించనుంది.


దశల వారీగా అన్ని సర్కిళ్లలో ఈ తరహా వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. గతంలోనూ పలు సర్కిళ్లలో ఈ వాహనాలు అద్దె ప్రాతిపదికన వినియోగించారు. జరిమానా విధించకుండా పౌరులను భయపెట్టి కొందరు ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు అవకతవకలకు ఆస్కారం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్లు

మావోయిస్టుల భారీ డంప్‌ల స్వాధీనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:19 AM