ఈ చాణక్య నీతి సూత్రలతో అత్తాకోడళ్ల మధ్య గొడవలు మాయం
ABN , Publish Date - Nov 18 , 2026 | 07:53 AM
అత్తాకోడళ్ల పోరుపై బోలెడు సామెతలు, పాటలు, కథలూ ఉన్నాయి. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని లోకోక్తి.
ఇంటర్నెట్ డెస్క్: అత్తాకోడళ్ల పోరుపై బోలెడు సామెతలు, పాటలు, కథలూ ఉన్నాయి. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని లోకోక్తి. అత్తాకోడళ్ల సంబంధం అత్యంత సున్నితమైంది. ఈ సంబంధంలో రెండు వేర్వేరు తరాల ఆలోచనలు, అభిప్రాయాలు, అనుభవాలు కలుస్తాయి. అందుకే మనస్పర్థలు, అపార్థాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసమే ఆచార్య చాణక్యుడు కొన్ని సూత్రాలు బోధించారు. వాటిని పాటిస్తే అత్తాకోడళ్ల గొడవలు ఎగిరిపోతాయని ఆయన వివరించారు.
పరస్పర గౌరవం
అత్త, కోడలు.. ఇద్దరివీ వేరు వేరు అభిప్రాయాలు, అభిరుచులు. అందుకే వీరు ఒకరినొకరు గౌరవించుకోవాలి. అత్త తన అభిప్రాయాలను కోడలిపై రుద్దకూడదు. అలాగే కోడలు కూడా అత్తకు సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలను అర్థం చేసుకోవాలి. ఈ పరస్పర గౌరవమే బంధాన్ని బలపరుస్తుంది.
సంభాషణతో అపార్థాలు దూరం
అత్తాకోడళ్లు ఒకరితో మరొకరు మనస్ఫూర్తిగా సంభాషించాలి. చక్కటి సంభాషణతో అన్ని గొడవలూ దూరమవుతాయి. ఇంటి బాధ్యతలు, నెలవారీ ఖర్చులు లాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇరువురూ మాట్లాడుకోవాలి. అలాగే కొత్త బాధ్యతలు నేర్చుకుని, వాటికి అలవాటు పడేందుకు కోడలికి అత్త తగిన సమయం ఇవ్వాలి.
ఇతరులకు చెప్పొద్దు
ఇంట్లో ఏర్పడే వివాదాలను బంధువులతో, ఇరుగుపొరుగువారితో ఎప్పుడూ పంచుకోకూడదు. ఇలా చేయడం వల్ల సమస్యలు ఇంకా పెరుగుతాయి. అత్తాకోడళ్ల మధ్య ఉన్న విభేదాలు బయటకు వెళ్లడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే వాటిని పరిష్కరించుకోవడం ఉత్తమం.
కోపంలో జాగ్రత్త
ఏ సంబంధాన్ని అయినా కోపం చెడగొట్టగలదు. ఎంతటి సన్నిహితులనైనా అది విడగొట్టగలదు. అందుకే ఆగ్రహంలో ఉన్నప్పుడు వాదనలకు దిగకూడదు. అలాంటి సందర్భాల్లో నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. కోపం తగ్గడానికి కొంత సమయమే పడుతుంది. కానీ ఆ ఆవేశంలో అన్న మాటలు చేసే గాయం ఏళ్లు గడిచినా తగ్గదు. అందుకే గొడవలు జరుగుతున్నప్పుడు అత్తాకోడళ్లు (ఇది అందరికీ వర్తిస్తుంది) ప్రశాంతంగా ఉండాలి.
ఇవీ చదవండి
ధనవంతులుగా మారాలనుకుంటున్నారా..? అయితే చాణక్యుడి సూచనలివే
జీవితంలో ఎదగాలంటే..? నాలుగు సింపుల్ సూపర్ టిప్స్..