రింగ్ రోడ్డులో జిల్లా బస్సుల స్టాప్ మార్పు
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:28 AM
ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది.
తాత్కాలికంగా ఉప్పల్ నల్ల చెరువు వద్దకు
రూ.3.20 కోట్లతో ప్రణాళికలు సిద్ధం
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ రింగ్ రోడ్డులో జిల్లాల బస్సులు ఇక ఆగవు. త్వరలో ఇక్కడి నుంచి బస్టాప్ మారనుంది. ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ రామంతాపూర్ వైపు పొడిగింపు పనులు జరుగనున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ), ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. ఉప్పల్ నల్ల చెరువు వద్దకు తాత్కాలికంగా జిల్లాల స్టాప్ మార్చి.. ప్రస్తుతం సిటీ బస్సులు ఆగుతున్న బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకీకరించనున్నారు.
ఇందుకోసం రూ.3.20 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనలకు సోమవారం స్టాండింగ్ కమిటీ సాధారణ సమావేశం ఆమోదం తెలిపింది. త్వరలో టెండర్ నోటిఫికేషన్ ప్రకటించనున్నట్టు ఇంజనీరింగ్ అధికారొకరు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న బస్టాపును తాత్కాలికంగా ఉప్పల్ నల్లచెరువు వద్దకు మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే చెరువు వద్ద విస్తరణ పనులు చేపట్టారు. లోకల్ బస్సులు నిలుపుతున్న బస్టాండ్‌ను పూర్తిగా ఆధునీకీకరించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న భవనం, బస్ షెల్టర్లు, డ్రైవ్ వేలు తొలగించి.. కొత్తగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసమే?
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు ఎనిమిదేళ్లుగా సాగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్ ఆవలి వరకు జాతీయ రహదారుల సంస్థలోని ఆర్ అండ్ బీ అధికారులు నిర్మిస్తుండగా.. ఇక్కడి నుంచి రామంతాపూర్ వైపు పొడిగింపు పనులు జీహెచ్‌ఎంసీ చేపడుతోంది. గతంలోనే కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయగా పలు కారణాలతో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయి. తాజాగా తిరిగి పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకల మళ్లింపు/పరిమిత లేన్లలో అనుమతించే అవకాశముంది. ఈ క్రమంలోనే బస్టాప్ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూర్లు, ఇతరత్రా పనుల కోసం వెళ్లే వారికి ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్టాప్ ఉండడం అనువుగా ఉంటుంది. మెట్రోలో వెళ్లి బస్సులు ఎక్కే అవకాశముంది. బస్టాప్ మార్చిన పక్షంలో ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వెళ్లడం ఇబ్బందికరమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News