నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:01 PM
నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా, మార్చి22 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో ఈరోజు(ఆదివారం) అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన పర్యావరణ ప్రేమికులను, స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
నిర్మల్ అడవుల్లో కార్చిచ్చు..
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల పరిధిలోని అడవుల్లో భారీగా మంటలు చెలరేగాయి. ముఖ్యంగా దేవునిగూడ గ్రామానికి సమీపంలో ఉన్న హరిత వనంలో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఎండిన ఆకులు, గడ్డి వల్ల మంటలు అంటుకున్నాయి. దేవునిగూడ సమీపంలోని మొక్కలు, చెట్లకు మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. అడవిలోని జీవవైవిధ్యానికి ఇది పెద్ద ముప్పుగా మారింది.
వన్యప్రాణులకు ముప్పు..
అడవిలో మంటలు చెలరేగడం వల్ల చిన్న చిన్న జీవులు, పక్షులు మృత్యువాత పడే అవకాశం ఉంది. అలాగే పెద్ద జంతువులు ప్రాణభయంతో జనవాసాల్లోకి వచ్చే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు.
అటవీశాఖ నిర్లక్ష్యం..
మంటలు చెలరేగి గంటలు గడుస్తున్నా, అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే మంటలు ఇంతలా వ్యాపించేవి కావని ప్రజలు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అడవుల్లో సీసీ కెమెరాలు లేదా వాచ్ టవర్ల ద్వారా నిరంతరం అటవీశాఖ అధికారులు పర్యవేక్షించాలని స్థానికులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్
మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News