బాసరలో మంచినీటికి కటకట..
ABN , Publish Date - May 01 , 2026 | 01:45 PM
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.
మూడు రోజులు ‘భగీరథ’ బంద్
గోదావరి పంప్ హౌస్‌లో మొరాయించిన మోటార్
చుక్క నీరు రాక జనం విలవిల
రిపేర్‌కు మరో రెండు రోజులు పడుతుందంటున్న అధికారులు
బాసర(నిర్మల్): నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు. గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్న మోటార్ సాంకేతిక సమస్యతో చెడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మండల కేంద్రానికి తాగునీరు అందించే ప్రధాన మోటార్ ఖరాబవ్వడంతో పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా ఆగడంతో ఇళ్లలో నిల్వ ఉన్న నీరు అయిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయక పోవడంతో మహిళలు కిలో మీటర్ల మేర నడిచి వెళ్లి, బోర్ల వద్ద నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో రెండు రోజులు ఇంతేనా...?
మోటార్ రిపేర్ విషయమై అధికారులను సంప్రదించగా, అది బాగుకావడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పడుతుం దని సమాధానం ఇచ్చినట్లు గ్రామస్థులు వాపోతున్నారు. అంటే ఇప్పటికే మూడు రోజులు గడవగా, మరో మూడు రోజుల పాటు నీటి సరఫరా పునరుద్ధరణ జరిగే అవకాశం లేదని స్పష్ట మవుతోంది. వరుసగా ఆరు రోజులు నీళ్లు లేకపోతే మేమెలా బతకాలి..? అని బాసర వాసులు ప్రశ్నిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
నీటి సరఫరా పునరుద్ధరణపై అధికారులు జాప్యం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మోటార్ రిపేర్ చేయించి, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా వీధి వీధికీ నీటిని అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ... ఇలా మోటార్ సాకుతో రోజులు తరబడి ఆగిపోవ డంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్క్వేర్‌లో ఒకటి లేదా రెండు మోటార్లు ఉంటాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాటిని వెంటనే బిగించి సమస్య లేకుండా సర్దుబాటు చేస్తారు కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఏర్పాటు కనిపించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
మెట్రో రెండో దశకు లైన్‌క్లియర్!
Read Latest Telangana News and National News