తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీలపై డీజీపీ సీవీ ఆనంద్ క్లారిటీ
ABN , Publish Date - May 01 , 2026 | 01:15 PM
తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్, మే 1: తనపై నమ్మకంతో రాష్ట్ర డీజీపీగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చడం కోసం పూర్తిస్థాయిలో అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్ పోలీస్‌గా గుర్తింపు పొందిందని.. బ్రాండ్ ఇమేజ్ సాధించిందని అన్నారు. శాంతి భద్రతలు కాపాడటం, నేర నియంత్రణ, నేర దర్యాప్తులో తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పని చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.
కేసుల దర్యాప్తులో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు నేరాల్లో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం సైబర్ నేరాలు భారీగా పెరిగాయన్నారు. సైబర్ నేరాలను అదుపు చేయడంలో జిల్లా ఎస్పీల పాత్ర కీలకంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సమస్య ఇప్పుడు సమాజంలో విస్తరించిందని.. దాన్ని అరికట్టడం కోసం ఈగిల్, నార్కోటిక్స్ సెల్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు టాప్ ప్రయారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయబోతున్నట్లు సీవీ ఆనంద్ ప్రకటించారు.
మహిళల సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్ వంటి సమస్యలు వ్యవస్థీకృత నేరాలుగా మారాయని.. వీటిపై ప్రత్యేక దృష్టి పెడతామని డీజీపీ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే ప్రమాదాలపై కూడా పోలీసు శాఖ మరింత దృష్టి సారిస్తుందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. నక్సలైట్ల నిర్మూలన కోసం ఏర్పాటైన గ్రేహౌండ్స్, SIBని సరైన విధంగా పోలీస్ శాఖలో వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని.. రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్‌లో మార్పులు తీసుకొస్తామని డీజీపీ తెలిపారు. ప్రైవేటు సెక్టార్‌లో ఉపయోగిస్తున్న AIని పోలీస్ శాఖలో కూడా అమలు చేస్తామన్నారు.
పోలీస్ శాఖలో అధికారులు.. సంప్రదాయాలు, మర్యాదలు మరచిపోతున్నారని సీవీ ఆనంద్ అన్నారు. వాటిని గుర్తు చేసి, అధికారులు సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర దర్యాప్తులో సీసీ కెమెరాలపై మాత్రమే ఆధారపడటం సరికాదని.. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో దొరికిన ఆధారాలతోనే కేసులను ఛేదించే పాత పద్ధతులను మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. గోవధపై పోలీసులే చర్యలు తీసుకుంటారని, ప్రైవేటు వ్యక్తులు రోడ్లపైకి రావొద్దని సీవీ ఆనంద్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
లంచం అడిగిన ఆర్టీసీ అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
కవిత భయం వల్లే కేసీఆర్ బయటకు వస్తున్నారు: పీసీసీ చీఫ్
Read Latest Telangana News And Telugu News