కూటమి ప్రభుత్వంలో కార్మికులకు భద్రత, భరోసా: మంత్రి సుభాశ్
ABN , Publish Date - May 01 , 2026 | 12:22 PM
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు.
కృష్ణా జిల్లా, మే 1: టీడీపీ జెండాలోనే కార్మికుల కోసం చక్రం చిహ్నంగా ఉందని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. పమిడిముక్కల గ్రామంలో నిర్వహించిన ప్రజా వేదిక సభలో మంత్రి మాట్లాడుతూ.. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో కార్మికులు తిండి లేక పస్తులు ఉన్నారని.. వారి జీవితాలను చీకట్లోకి నెట్టారని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాల కార్మికులు రాష్ట్రంలో పనుల కోసం వస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ సెంటర్లుగా ఐదు నగరాలను ఎంపిక చేశామని.. వీటిని పదిహేను నగరాలకు విస్తరించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. కార్మికుల కోసం గుప్పెడు ఇసుక కూడా గత ప్రభుత్వం వేయలేదని మండిపడ్డారు. వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారి నిధులు వాడేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి, భద్రత, భరోసా ఇచ్చామని వాసంశెట్టి సుభాశ్ తెలిపారు.
ఏపీ కోసం ఆలోచన చేసే ఏకైక నేత చంద్రబాబు: వర్ల కుమార్
మే డే సందర్భంగా కార్మికులకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలో పేదల ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. అమ్మో ఒకటో తేదీ వస్తుందా అనే స్థాయి నుంచి.. హమ్మయ్య ఒకటో తేదీ వస్తుంది అనేలా పేదల జీవితాల్లో పెన్షన్ ద్వారా ఆనందం నింపారని తెలిపారు. గత ఐదేళ్లుగా వైసీపీ ఉండగా.. వ్యవసాయం దండగ అనేలా చేశారని మండిపడ్డారు. నేడు చంద్రన్న ఉండగా చింతేల అని రైతులు గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నారన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తే కూటమి విజయం చిరస్థాయిగా ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకెళ్తున్నామని తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య సమస్యలు పరిష్కరించాలని కోరారు. 24 గంటలూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచన చేసే ఏకైక నేత చంద్రబాబు అని వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం, త్యాగాలు అమూల్యమైనవి: కేసీఆర్
శ్రామిక వర్గ హక్కులను గుర్తించే చారిత్రాత్మక దినోత్సవం మే డే: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News