నిర్మల్ బాసర సరస్వతీ ఆలయంలో భారీ చోరీ.. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ అపహరణ
ABN , Publish Date - Jun 23 , 2026 | 06:26 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు.
నిర్మల్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ దేవి (Basara Gnana Saraswati Temple Theft) ఆలయ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. నిన్న (సోమవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటంతో పాటు, హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
చోరీ జరిగిందిలా..
ఈరోజు (మంగళవారం) ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ఆలయ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటం మాయం కావడంతో పాటు, భక్తులు సమర్పించిన కానుకల హుండీ కూడా కనిపించకుండా పోయింది. ఈ హుండీలోని నగదును కాజేసిన తర్వాత వ్యాసగుడి సమీపంలో పడేసి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన అర్చకులు వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
ఆలయ అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆలయ వెనుక వైపు నుంచి దొంగలు లోపలికి వచ్చినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అక్కడ ఉన్న కొన్ని ఆధారాలను సేకరించారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో కూడా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఏ వైపు నుంచి వచ్చారు, ఎంతమంది ఉన్నారనే కోణంలో విజువల్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
హోం గార్డుల భద్రతపై ప్రశ్నలు..
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే బాసర ఆలయంలో ఈ స్థాయి చోరీ జరగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ఆలయ రక్షణ విధుల్లో ఏకంగా ఆరుగురు హోంగార్డులు ఉన్నప్పటికీ దొంగలు ఇంత ఈజీగా తాళాలు పగులగొట్టి వెండి కిరీటం, హుండీని ఎలా అపహరించుకుపోయారనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన సమయంలో హోం గార్డులు ఎక్కడ ఉన్నారు?, విధుల్లో నిర్లక్ష్యం వహించారా? అనే కోణంలోనూ పోలీసులు వారిని విచారిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఆలయ భద్రతను మరింత కఠినతరం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు
కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News