టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌తో వివాదం.. పాక్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది: గంగూలీ
ABN , Publish Date - Feb 09 , 2026 | 10:37 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ నుంచి పాకిస్థాన్ తప్పుకోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టాడు.
‘వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ ఆడకుండా వెనక్కి తగ్గడం ఏంటి? మ్యాచ్ శ్రీలంకలోనే జరుగుతుంది కదా. ప్రపంచ కప్(T20 World Cup 2026)లో ప్రతి పాయింట్ ఎంతో కీలకం. ఇలాంటప్పుడు పాక్ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించాడు. ‘మేం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. మా ఫ్లైట్ కూడా బుక్ అయింది. ఫిబ్రవరి 15న మాకు మ్యాచ్ ఉందని చెప్పారు. మిగతా వాళ్ల నిర్ణయం మన చేతిలో ఉండదు’ అని సూర్య స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా అమెరికాతో తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ.. భారత్ తన ప్రణాళికలు ఏమీ మార్చుకోకుండా అదే దూకుడును ప్రదర్శించాలని గంగూలీ(Sourav Ganguly) సలహా ఇచ్చాడు. ‘టీ20 క్రికెట్‌లో మొదటి బంతి నుంచి బాదుతూనే ఉండాలి. భారత్‌లో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. చాలా నెలల నుంచి వాళ్లు దూకుడుగానే ఆడుతున్నారు. బాదే క్రమంలో ఒక్కోసారి తడబడే అవకాశాలు ఉంటాయి. అమెరికాపై అదే జరిగింది. అలా అని జట్టు ప్రణాళికలను మార్చుకోకూడదు. ఎప్పటిలాగే ఆడాలి. భారత జట్టు చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ప్రపంచ కప్ సాగేకొద్దీ జట్టు జోరు అందుకుంటుంది. సూర్యకుమార్ యాదవ్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించి ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్‌కు వచ్చాడు. అమెరికాపై అతడు స్వేచ్ఛగా ఆడాడు. తాను మ్యాచ్ విన్నర్ అని నిరూపించుకున్నాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..