Share News

భారత్‌లో మరో సరికొత్త లీగ్..

ABN , Publish Date - Feb 08 , 2026 | 08:20 PM

భారత్‌లో తొలిసారిగా కిక్‌ బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌(కేఎస్‌ఎల్‌) జరగబోతోంది. ఈ మేరకు దిల్లీలో లీగ్‌ ప్రారంభ వేడుకలు జరిగాయి.

భారత్‌లో మరో సరికొత్త లీగ్..
India’s first Kickboxing Super League

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌లో ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ లీగ్‌లను చూశాము. అయితే తొలిసారిగా కిక్‌ బాక్సింగ్‌ సూపర్‌ లీగ్‌(కేఎస్‌ఎల్‌) కూడా రానుంది. ఆదివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో లీగ్‌ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఆర్గనైజేషన్స్ (WAKO) ఆధ్వర్యంలో నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్న వేళ కేఎస్‌ఎల్‌ను ప్రారంభించారు. భారత్‌లో కిక్‌ బాక్సింగ్‌ను(Kickboxing) అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ లీగ్‌ను తీసుకొచ్చామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని క్రీడా రంగాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులు, జాతీయ క్రీడా అధికారులు, అథ్లెట్లు, కోచ్‌లు హాజరయ్యారు.


'మారుమూల క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పిస్తూ అథ్లెట్లకు కాంట్రాక్టులు, ప్రతిభకు ప్రోత్సాహకాలు అందిస్తూ భారత్‌లో కిక్‌ బాక్సింగ్‌కు(Kickboxing India) గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేఎస్‌ఎల్‌ను ప్రారంభించాం. మొదటి సీజన్ లో ఎనిమిది ఫ్రాంఛైజీ జట్లు ఉంటాయి. ఒక్కో జట్టులో 34 మంది ఫైటర్లు ఉంటారు. ఈ లీగ్‌లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రీడాకారుల్లో 60:40 నిష్పత్తిలో పురుషులు, మహిళలు ఉంటారు. అలానే 20 శాతం అంతర్జాతీయ అథ్లెట్లు ఈ లీగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ లీగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కోటి రూపాయల నగదు బహుమతి ఉంటుంది’ అని నిర్వాహకులు తెలిపారు.


తొలి సీజన్ 16 రోజులపాటు జరుగుతుంది. ఇందులో మొత్తం 238 బౌట్‌లు ఉంటాయి. ఓపెన్ రిజిస్ట్రేషన్లు, దేశవ్యాప్తంగా ట్రయల్స్, ఎంపిక శిబిరాలు, అధికారిక వేలం ప్రక్రియ ద్వారా క్రీడాకారుల(Athletes in KSL) ఎంపిక జరుగుతుంది. జట్ల యాజమాన్యాలతో క్రీడాకారులకు సీజన్ వారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ లీగ్‌ను ఎంతో పటిష్ఠంగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేఎస్‌ఎల్‌ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ అడ్లఖ తెలిపారు. దీని ద్వారా అథ్లెట్స్‌కు, జట్లకు, యాజమాన్యాలకు లాభం చేకూరుతుందన్నారు. కిక్‌ బాక్సింగ్ అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడల్లో ఒకటి. దీన్ని దాదాపు 150కి పైగా దేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఆటను వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఆర్గనైజేషన్స్ (WAKO) ఆధ్వర్యంలో జరుగుతుంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు

Updated Date - Feb 08 , 2026 | 08:45 PM