Share News

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:28 PM

టీ20 ప్రపంచకప్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో సూర్య తన ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయాల్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న కీలక రికార్డును బద్దలు కొట్టాడు..

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్.. కోహ్లీ రికార్డు బద్దలు
Suryakumar Yadav

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు గెలుపును అందించాడు. అమెరికా బౌలర్ల ధాటికి ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. సూర్య ఒంటరిగా నిలబడి పోరాడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. సూర్య(Suryakumar Yadav) తన ఇన్నింగ్స్‌తో టీ20 అంతర్జాతీయాల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరిట ఉన్న కీలక రికార్డును బద్దలు కొట్టాడు.


ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇది టీ20 ఫార్మాట్లో అతడికి 17వ అవార్డు. దీంతో ఈ విభాగంలో విరాట్ కోహ్లీ (16) రికార్డును అధిగమించి, భారత్ తరఫున అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన ఆటగాడిగా సూర్య చరిత్ర సృష్టించాడు. కాగా విరాట్ 125 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు ఈ అవార్డు అందుకోగా.. సూర్య కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 17 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్నాడు. రోహిత్ శర్మ(14), అక్షర్ పటేల్(8) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.


ప్రపంచంలో మూడో స్థానం

టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు మలేషియాకు చెందిన విరందీప్ సింగ్ (22), జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా (19) మాత్రమే ఉన్నారు. సూర్య ప్రస్తుత ఫామ్‌ను చూస్తే త్వరలోనే ఈ రికార్డులకూ సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 08 , 2026 | 12:59 PM