Share News

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:21 AM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.

ఆ సమయంలో గంభీర్ ఇచ్చిన సలహా వల్లే గెలిచాం: సూర్యకుమార్
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. అమెరికా బౌలర్ల ధాటికి పేకమేడల్లా కుప్పకూలింది. ఒకానొక సందర్భంలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నాక్ ఆడాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో ఏకంగా 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య ఒంటరి పోరాటం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీమిండియా 161 పరుగుల చేసింది. 162 పరుగులతో ఛేదనకు దిగిన అమెరికా.. 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్‌కు విజయం లాంఛనమైంది.


విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.


క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!

Updated Date - Feb 08 , 2026 | 10:21 AM