Share News

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:46 PM

అండర్-19 ప్రపంచ కప్-2026లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్‌లో ఇంగ్లాండ్ ను ఓడించి.. విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 10 సార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. ఆరోసారి టైటిల్‌ను ముద్దాడింది.

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
ndia U19 champions

స్పోర్ట్స్ డెస్క్: అండర్-19 ప్రపంచ కప్(World Cup-2026)లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. ఇవాళ(శుక్రవారం) జరిగిన తుది పోరులో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించి.. విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్‌ను యంగ్ ఇండియా ముద్దాడింది. హరారే వేదికగా జరిగిన ఈ టైటిల్ పోరులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi )(175) విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి.. భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. యువ సంచలనం వైభ‌వ్ సూర్యవంశీ ఈ టోర్నీ చ‌రిత్రలో చిర‌స్మర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయుష్ మాత్రే(53), అభిజ్ఞాన్ కుందు(40), కాన్షిక్ చౌహాన్ (37), త్రివేది(32), విహాన్ మల్హోత్ర(30) రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్లలో జేమ్స్ మింటో 3 , సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.


ఫాల్కనర్ శతకం వృథా..

అనంత‌రం 412 పరుగుల భారీ ల‌క్ష్య చేధించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.2 ఓవ‌ర్ల‌లో 311 ప‌రుగులకు ఆలౌటైంది. కాలేబ్ ఫాల్కనర్ చేసిన సెంచరీ వృథా అయింది. ఓవైపు క్రమం త‌ప్పకుండా వికెట్లు ప‌డుతున్నప్పటికి ఫాల్కనర్ మాత్రం త‌న ప్రయ‌త్నం ఆప‌లేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు. అతడి కంటే ముందు ఓపెనర్ బెన్ డాకిన్స్ (66), థామస్ రెవ్(31) త‌మ వంతు ప్రయ‌త్నం చేశారు. మిగితా బ్యాట‌ర్లు మొత్తం దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.


ఒకానొక దశలో 171/3 తో జోరు మీద ఉన్న ఇంగ్లాండ్... కాసేపటికే 177/7 తో కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఫాల్కనర్ వచ్చి..వీరచితంగా పోరాడు. జేమ్స్ మింటో, ఫాల్కనర్ 8వ వికెట్ కు 92 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి భాగస్వామ్యాన్ని అంబరీష్ విడగొట్టాడు. 269 పరుగుల వద్ద మింటోను అంబరీష్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత భారత్ విజయం లాంఛనమైంది. ఇక భార‌త బౌల‌ర్లలో ఆర్‌ఎస్ అంబరీష్ 3, కాన్షిక్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఫైన‌ల్లో భారీ సెంచ‌రీతో చెల‌రేగిన వైభ‌వ్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు.


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

Updated Date - Feb 06 , 2026 | 09:11 PM