Share News

పొట్టి ప్రపంచ కప్‌కు హర్షిత్ రాణా దూరం! సిరాజ్‌కు ఛాన్స్ !

ABN , Publish Date - Feb 06 , 2026 | 06:13 PM

పొట్టి ప్రపంచ కప్-2026 ముగింట భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పేసర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పి కారణంగా టీ20 ప్రపంచ కప్‌కు దూరం కానున్నారని సమాచారం. అతడి స్థానంలో..

పొట్టి ప్రపంచ కప్‌కు హర్షిత్ రాణా దూరం! సిరాజ్‌కు ఛాన్స్ !
Harshit Rana injury

స్పోర్ట్స్ డెస్క్: రేపటి నుంచి టీ20 ప్రపంచ కప్(ICC Mens T20 World Cup) సంగ్రామం ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రేపు(ఫిబ్రవరి 7న) టీమిండియా తన తొలి మ్యాచ్ యూఎస్ఏతో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఓ బిగ్ షాక్ తగిలింది. టీమిండియా పేసర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో హర్షిత్‌ మైదానాన్ని వీడాడు. అతడు ఆ మ్యాచ్‌లో ఒక ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ వేసి 16 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్‌లోనూ రెండు సార్లు తన రనప్‌ను ఆపాడు. ఈ మ్యాచ్ సమయంలో రాణా మోకాలి నొప్పితో బాధపడ్డట్లు కనిపించాడు.


హర్షిత్ రాణా కుడి మోకాలి జాయింట్‌లో సమస్య ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వైద్య పరీక్షలోనూ ఆ విషయం వెల్లడైనట్లు సమాచారం. డాక్టర్ల సూచన మేరకు హర్షిత్‌ రాణా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారత జట్టులో మార్పులు చేర్పులు జరిగే అవకాశముంది. ఇదే విషయాన్ని ఈ ఐసీసీ టోర్నీకి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) తెలిపాడు.


‘హర్షిత్‌ రాణా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఆ విషయం మాకు ఈ రోజు తెలిసింది. ఒక వేళ హర్షిత్‌ జట్టుకు దూరమైతే, అది మాకు పెద్ద నష్టం. ఇదే సమయంలో మేం వేరే కాంబినేషన్లు ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తాము. మా రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు’ అని సూర్య అన్నాడు. ఇక హర్షిత్ రాణా స్థానంలో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహమ్మద్ సిరాజ్ ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి.


సిరాజ్ టీమిండియా తరఫున 111 మ్యాచ్‌లు (45 టెస్టులు, 50 వన్డేలు మరియు 16 టీ20లు) ఆడాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై ఇప్పటికే సందేహాలు తలెత్తుతున్న తరుణంలో, రాణా భారత జట్టు నుంచి నిష్క్రమించడం ప్రపంచ టోర్నమెంట్‌కు ముందు టీమిండియా ఆభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.


ఇవీ కూడా చదవండి:

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

Updated Date - Feb 06 , 2026 | 06:13 PM