స్మృతి తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే ఆడింది: ఆర్సీబీ కోచ్
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:42 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానపై కోచ్ మలోలన్ రంగరాజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిందన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana)పై కోచ్ మలోలన్ రంగరాజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిందన్నాడు. గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా రెండోసారి ఆర్సీబీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం.. ఆర్సీబీ కోచ్ రంగరాజన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
మీడియాతో రంగరాజన్ మాట్లాడుతూ.. ‘ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన తీవ్రమైన ఫ్లూతో బాధపడుతోంది. జ్వరం కారణంగా ఆమె చాలా అనారోగ్యంగా ఉంది. కానీ ఆ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా చూసుకుంది. నేను స్మృతితో మాట్లాడినప్పుడు.. 'నాకు ఇబ్బంది లేదు. నేను ఆడతాను’ అని చెప్పింది. తాను చెప్పినట్లుగానే ఫైనల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. స్మృతి.. గత 12 నెలలుగా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఆమె బంతిని చాలా చక్కగా టైమ్ చేసింది. అలానే అవసరమైన సమయంలో ప్రత్యర్థి బౌలర్‌పై అటాకింగ్ కూడా సింది' అని అన్నాడు.
'స్మృతి మంధాన బ్యాటింగ్ విషయానికి వస్తే ఆమె ఒక మేధావి. అందుకే ఆమె జీవితంలో ఇంతటి విజయాన్ని సాధించగలిగింది. ఆమె ఎప్పుడూ తన ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి, తన నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది’ అని స్మృతి మంధానను ప్రశంసించారు రంగరాజన్. వడోదర వేదికగా డబ్ల్యూపీఎల్(WPL-2026) తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన (87; 41 బంతుల్లో) అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇవీ కూడా చదవండి:
వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్..
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్