Share News

మనోళ్లే.. మనకు ప్రత్యర్థులు

ABN , Publish Date - Feb 08 , 2026 | 10:25 AM

ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ కచ్చితంగా హాట్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు.

మనోళ్లే.. మనకు ప్రత్యర్థులు

ఈ ప్రపంచకప్‌లో టైటిల్‌ వేటకు ఏకంగా 20 దేశాలు సమరశంఖం పూరించాయి. ఇవి నాలుగు గ్రూపులుగా విడిపోయి అమీతుమీకి సై అంటున్నాయి. ట్రోఫీయే లక్ష్యంగా అడుగుపెట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ కచ్చితంగా హాట్‌ ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కప్‌ నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే, ఇంత పట్టుదలతో తలపడుతున్న టీమిండియాకు ప్రత్యర్థులుగా మనోళ్లే బరిలోకి దిగుతుండడం ఇక్కడ విశేషం. అదెలాగంటే.. భారత మూలాలున్న 30 మందికిపైగా ఆటగాళ్లు వివిధ దేశాల తరఫున ఈ టీ20 ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరంతా టోర్నీలో ఏదో ఒక దశలో భారత జట్టుతో ప్రత్యర్థిగా తలపడనున్నారన్నమాట. ఈ ఆటగాళ్లలో కొందరు భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడిన వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ఇంతమంది భారత సంతతి ఆటగాళ్లు మెగా టోర్నీలో పోటీపడుతుండడం ఇదే తొలిసారి.


ఇటీవలి కాలంలో ఇతర దేశాల జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లలో ఎప్పటినుంచో భారతీయ ప్రాతినిథ్యం ఉంటున్నా.. దక్షిణాఫ్రికా జట్టులో సైతం ఇటీవల భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న భారత సంతతి ఆటగాళ్లలో స్టార్‌ ఎట్రాక్షన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రను చెప్పుకోవచ్చు. కివీస్‌ జట్టులో ప్రధాన సభ్యుడిగా ఉన్న రచిన్‌ పూర్వీకులది చెన్నై. కివీస్‌ జట్టులోనే ఇష్‌ సోధి కూడా భారతీయ మూలాలున్న క్రికెటర్‌. మరో బలమైన జట్టు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహారాజ్‌, నెదర్లాండ్స్‌ జట్టులోని ఆర్యన్‌ దత్‌ కూడా భారత సంతతి వారే.


జట్లను నడిపిస్తున్నారు..

ఈసారి టీ20 ప్రపంచకప్‌లో రెండు విదేశీ జట్లను భారతీయ మూలాలున్న ఆటగాళ్లే నడిపిస్తున్నారు. ఒమన్‌ జట్టుకు 36 ఏళ్ల జతిందర్‌ సింగ్‌, కెనడా జట్టుకు దిల్‌ప్రీత్‌ బజ్వా కెప్టెన్లుగా ఎంపికయ్యారు. పంజాబ్‌లో జన్మించిన జతిందర్‌ కుటుంబం ఒమన్‌కు వలస వెళ్లింది. అక్కడే ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారిన జతిందర్‌.. అనతికాలంలోనే గల్ఫ్‌ అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2024లో ఒమన్‌ జాతీయ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అతను.. గతేడాది ఆసియా కప్‌లోనూ జట్టును నడిపించాడు. ఇప్పుడు తొలిసారి ప్రపంచకప్‌లో జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ గల్ఫ్‌ దేశ జట్టు వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ వినాయక్‌ శుక్లా, జితేన్‌ రామనంది, కరణ్‌, ఆశిష్‌ కూడా భారత్‌కు చెందినవారే.


book5.3.jpgభారత్‌లో తిరస్కరణకు గురై..

23 ఏళ్ల దిల్‌ప్రీత్‌ బజ్వాది మరో తరహాగాథ. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన దిల్‌ప్రీత్‌ జూనియర్‌ స్థాయిలో ఎన్నోసార్లు మెరుగైన ప్రదర్శన చేశాడు. అయినా అతడిని గుర్తించడంలో పంజాబ్‌ క్రికెట్‌ సంఘం విఫలమైంది. తన రాష్ట్రంలో క్రికెట్‌ రాజకీయాలకు విసుగుచెందిన దిల్‌ప్రీత్‌ మకాంను కెనడాకు మార్చాడు. ఆ దేశం తరఫున ఇప్పటికే 9 వన్డేలు, 17 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఒకప్పుడు భారత్‌లో తిరస్కరణకు గురైన అతడు.. ఇప్పుడు కెనడా జాతీయ జట్టు పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగాడు. దిల్‌ప్రీత్‌తో పాటు రవీందర్‌ పాల్‌, శివమ్‌ శర్మ, యువరాజ్‌ శర్మ, గుంటూరుకు చెందిన వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ శ్రేయాస్‌ మొవ్వా, అజయ్‌ వీర్‌, అన్ష్‌ పటేల్‌, జస్కరణ్‌ దీప్‌ కూడా భారత మూలాలున్నవారే.


‘అమెరికా’లో సగానికి పైగా..

ఈ ప్రపంచకప్‌లో పోటీపడుతున్న అమెరికా జట్టులో సగానికిపైగా ఆటగాళ్లు భారత సంతతికి చెందిన వారే కావడం విశేషం. జట్టును నడిపిస్తున్న సారథి మోనాంక్‌ పటేల్‌, వైస్‌ కెప్టెన్‌ జెస్సీ సింగ్‌ కూడా వీరిలో ఉన్నారు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ అయిన 33 ఏళ్ల మోనాంక్‌.. గతంలో గుజరాత్‌ అండర్‌-19 జట్టుకు ఆడాడు. లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలరైన 34 ఏళ్ల సౌరభ్‌ నేత్రావల్కర్‌ది ముంబై. ఉద్యోగరీత్యా అమెరికాకు వలసవెళ్లిన సౌరభ్‌.. 2010లో కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సందీప్‌ శర్మలతో కలిసి అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పంజాబ్‌ మూలాలున్న జెస్సీ సింగ్‌, ఢిల్లీకి చెందిన మిలింద్‌ కుమార్‌, ముంబైలో పుట్టి పెరిగిన హర్మీత్‌సింగ్‌, సాయి ముక్కామల.. ఇలా దాదాపు జట్టంతా భారతీయమే.


42 మందికి పాక్‌ మూలాలు..

ఈసారి వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ మూలాలున్న ఆటగాళ్లు దాదాపు 42 మందిదాకా ఉండడం గమనార్హం. ఇంగ్లండ్‌ జట్టులోని ఆదిల్‌ రషీద్‌, రెహాన్‌ అహ్మద్‌, సకీబ్‌ మహ్‌మూద్‌, కెనడా జట్టు నుంచి సలీమ్‌ జాఫర్‌తో పాటు, అమెరికా, ఇటలీ, యూఏఈ, నెదర్లాండ్స్‌ జట్టులో మరికొందరు పాక్‌ సంతతి వారున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. నిలకడగా ధరలు

ఆర్ఎస్ఎస్‌‌ శతాబ్ధి సభకు హాజరైన సల్మాన్‌ ఖాన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Feb 08 , 2026 | 10:31 AM