టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:00 PM
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్.. భారత్‌కు రాబోమని, మ్యాచుల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీ(ICC)పై ఒత్తిడి తెచ్చింది. అయితే బంగ్లా చెప్పినట్లు భారత్‌లో ఎలాంటి భద్రతా సమస్యలు లేకపోవడంతో ఐసీసీ దీనిని తిరస్కరించింది. బీసీబీ(BCB) మొండి వైఖరి ప్రదర్శించడంతో టోర్నీ నుంచి తప్పించి.. ర్యాంకుల ఆధారంగా దాని స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది.
బంగ్లాకు మద్దతుగా పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తుందనే వార్తలు వచ్చాయి. తమ ప్రభుత్వ నిర్ణయం బట్టే తదుపరి ప్రణాళికలు ఉంటాయని పీసీబీ ఛైర్మన్ నఖ్వి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఐసీసీ హెచ్చరించడంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి తమ జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ (ICC Mens T20 World Cup) కోసం ఆ జట్టు శ్రీలంకకు వెళ్లబోతోంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) షెడ్యూల్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 2న పాక్ కొలంబోకు చేరనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పీసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) స్పందించాడు. ‘ప్రస్తుతం ఏదైతే జరిగిందో అదంతా బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధం. భారత్‌లో భద్రత పరమైన సమస్యలు లేవు. నా ఉద్దేశంలో ఇదంతా బంగ్లాదేశ్ తప్పు. ఆ దేశ క్రికెట్ జట్టు భారత్‌కు రాకపోవడం వల్ల చాలా కోల్పోనుంది. నిజానికి ఆ టీమ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బంగ్లా స్పిన్నర్లకు భారత్ పిచ్‌ల గురించి బాగా తెలుసు. అయితే టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు ఎవరైతే భారత్‌కు రారో.. వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. అలాగే ఆ దేశ క్రికెట్ బోర్డులు కూడా భారీగా నష్టపోయే అవకాశమూ ఉంది’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
నా రిటైర్మెంట్‌కు కారణం అదే.. యువీ షాకింగ్ కామెంట్స్..