Share News

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:03 PM

టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. రెండు , మూడు రోజుల్లో పీసీబీ తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఒక వేళ పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
Pakistan T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్-2026 మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. టీ20 సిరీసులు ఆడుతూ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించినప్పటికీ.. శ్రీలంకకు వెళ్లేందుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీని తెలిపారు. అయితే పాక్ తమకు సంబంధం లేని బంగ్లాదేశ్ విషయంలో జోక్యం చేసుకుని అనవసర రచ్చ చేస్తోంది.


టోర్నీ నుంచి పాక్ తప్పుకుంటే..

ఒకవేళ పాకిస్థాన్ ఈ మెగా టోర్నీని బహిష్కరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఐసీసీ టోర్నీలో ఇండియా, పాక్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్ర‌మంలో టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌-భార‌త్ మ్యాచ్ ర‌ద్దైతే బ్రాడ్‌కాస్టర్లు.. స్పాన్సర్ల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ అదే జ‌రిగితే ఆ న‌ష్టానికి పీసీబీ నుంచే వ‌సూలు చేస్తామ‌ని ఐసీసీ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. అలానే టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాల‌ర్లు (భారత కరెన్సీలో రూ. 2 కోట్లు పైమాటే)ను పాక్ కోల్పోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ సెమీఫైనల్ కు చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు),అలానే ఫైనల్ కు చేరి.. రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు) కోల్పోతుంది.


ఒక వేళ పాకిస్థాన్ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు. ఇదే సమయంలో ఏటా ఐసీసీ తమ సభ్య దేశాలకు రెవెన్యూ వాటా ఇస్తుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడకుంటే.. ఆ రెవెన్యూ వాటాను ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. దీని విలువ సుమారు 34.5 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు). ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పీసీబీ ఈ నష్టాన్ని భరించలేదు. ఫైన‌ల్‌గా పాకిస్తాన్ త‌మ ప్ర‌ద‌ర్శ‌న బ‌ట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాల‌ర్లు(దాదాపు రూ. 38 కోట్లు) వరకు కోల్పోయే ప్రమాదం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగితే.. కోట్లలో నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు

జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్‌

Updated Date - Jan 29 , 2026 | 04:18 PM