Share News

స్వియటెక్‌ అవుట్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:37 AM

ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌ టూ క్రీడాకారిణి ఇగా స్వియటెక్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సాధించాలన్న ఆమె కల భగ్నమైంది. కెరీర్‌లో ఇప్పటికే నాలుగు ఫ్రెంచ్‌ ఓపెన్‌...

స్వియటెక్‌ అవుట్‌

సెమీస్‌లో ఎవరెవరు?

పురుషుల సింగిల్స్‌

అల్కారజ్‌ X జ్వెరెవ్‌

సినర్‌ X జొకోవిచ్‌

మహిళల సింగిల్స్‌

సబలెంక X స్విటోలినా

రిబకినా X పెగులా

రిబకినా చేతిలో పరాజయం

  • సినర్‌, జొకోవిచ్‌ ముందుకు

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: ప్రపంచ టెన్నిస్‌ నెంబర్‌ టూ క్రీడాకారిణి ఇగా స్వియటెక్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సాధించాలన్న ఆమె కల భగ్నమైంది. కెరీర్‌లో ఇప్పటికే నాలుగు ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఓ వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను ఖాతాలో వేసుకున్న ఈ పోలెండ్‌ స్టార్‌ను మెల్‌బోర్న్‌ ట్రోఫీ మాత్రం ఊరిస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలుస్తానని టోర్నీ ఆరంభానికి ముందు ధీమా వ్యక్తం చేసిన స్వియటెక్‌కు క్వార్టర్‌ఫైనల్లో ఎలెనా రిబకినా (కజకిస్థాన్‌) ఝలకిచ్చింది. మాజీ ఫైనలిస్టు, ఐదోసీడ్‌ రిబకినా 7-5, 6-1తో రెండో సీడ్‌ స్వియటెక్‌ను వరుస సెట్లలో చిత్తు చేసింది. కెరీర్‌లో ఏకైక గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ను 2022లో అందుకున్న 26 ఏళ్ల రిబకినా.. ఇక్కడ 2023లో రన్నర్‌పగా నిలిచింది. ఆ తర్వాత ఈ వేదికపై ఆమెకిదే అత్యుత్తమ ప్రదర్శన. గురువారం జరిగే సెమీఫైనల్లో ఆరోసీడ్‌ జెస్సికా పెగులాతో రిబకినా అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్స్‌లో పెగులా (అమెరికా) 6-2, 7-6 (7-1)తో తన దేశానికే చెందిన నాలుగో సీడ్‌ అమందా అనిసిమోవాను ఓడించింది. మహిళల మరో సెమీ్‌సలో టాప్‌సీడ్‌ సబలెంకతో 12వ సీడ్‌ స్విటోలినా తలపడనున్న సంగతి తెలిసిందే.


జొకో..హమ్మయ్య!

రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలోవున్న జొకోవిచ్‌.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అదృష్టం వరించడంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. అందుకేనేమో.. జొకోవిచ్‌ కూడా ‘నేను చాలా లక్కీ’ అని క్వార్టర్స్‌ పోరు తర్వాత వ్యాఖ్యానించాడు. ప్రీక్వార్టర్స్‌ బరిలో దిగకుండానే ప్రత్యర్థి నుంచి వాకోవర్‌ అందుకున్న నాలుగోసీడ్‌ జొకో.. క్వార్టర్స్‌ పోరులో మైదానంలో కాసేపు తలపడ్డాక ప్రత్యర్థి, 5వ సీడ్‌ ముసెట్టి (ఇటలీ) గాయంతో మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. అయితే, ఆ సమయానికి రెండు సెట్లను 4-6, 3-6తో కోల్పోయిన నొవాక్‌.. మూడో సెట్‌లో మాత్రం 3-1తో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక, సెమీస్‌లో సినర్‌తో జొకో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సినర్‌ (ఇటలీ) 6-3, 6-4, 6-4తో బెన్‌ షెల్టన్‌ (అమెరికా)ను ఓడించాడు. రెండో సెమీ్‌సలో టాప్‌సీడ్‌ అల్కారజ్‌, మూడో సీడ్‌ జ్వెరెవ్‌ ఢీకొంటారు.

ఇవి కూడా చదవండి:

టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు

జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్‌

Updated Date - Jan 29 , 2026 | 07:02 AM