Share News

భళా.. బెంగళూరు

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:08 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో.

భళా.. బెంగళూరు

డబ్ల్యూపీఎల్‌లో నేడు

గుజరాత్‌ X ముంబై (రా. 7.30)

  • చెలరేగిన హ్యారిస్‌, మంధాన

  • యూపీపై విజయం

ఫైనల్‌ చేరిన ఆర్‌సీబీ

వడోదర: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో అత్యధికంగా 12 పాయింట్లతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. గ్రేస్‌ హ్యారిస్‌ (2/22; 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75) ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ స్మృతి మందాన (27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌) అజేయ హాఫ్‌ సెంచరీతో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వారియర్స్‌ 20 ఓవర్లలో 143/8 స్కోరు సాధించింది. ఓపెనర్లు దీప్తి శర్మ (55), లానింగ్‌ (41) మాత్రమే రాణించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 74 పరుగులు అందించాక.. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి బ్యాటింగ్‌ ఆర్డర్‌ తడబడింది. డిక్లెర్క్‌ నాలుగు వికెట్లతో దెబ్బతీసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హ్యారిస్‌ నిలిచింది.

హ్యారిస్‌ దూకుడు: ఓ మాదిరి ఛేదనను ఆర్‌సీబీ 13.1 ఓవర్లలోనే 147/2 స్కోరుతో పూర్తి చేసింది. ఓపెనర్‌ హ్యారిస్‌ తొలి రెండు బంతులనే ఫోర్లుగా మలిచి ఎదురుదాడి ఆరంభించింది. అలాగే మూడో ఓవర్‌లో ఏకంగా ఐదు ఫోర్లతో 20 రన్స్‌ రాబట్టింది. ఈ ధాటికి పవర్‌ప్లేలో జట్టు 63 రన్స్‌ సాధించగా.. హ్యారిస్‌ ఓ సిక్సర్‌తో 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసింది. మరో ఎండ్‌లో మంధాన హ్యాట్రిక్‌ ఫోర్లతో జట్టు స్కోరు 9వ ఓవర్‌లోనే వంద దాటింది. తర్వాతి ఓవర్‌లోనే హ్యారిస్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 26 బంతుల్లో అర్ధసెంచరీ బాదిన మంధాన మరో 41 బంతులుండగానే ఓ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించింది. కాగా.. ఎలిమినేటర్‌ విజేతతో ఫిబ్రవరి 5న ఫైనల్‌లో తలపడనుంది.

సంక్షిప్త స్కోర్లు: యూపీ: 20 ఓవర్లలో 143/8 (దీప్తి 55, లానింగ్‌ 41; డిక్లెర్‌ 4/22, హ్యారిస్‌ 2/22).

బెంగళూరు: 13.1 ఓవర్లలో 147/2 (హ్యారిస్‌ 75, మంధాన 54 నాటౌట్‌; ఆశ 1/24).

ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

Updated Date - Jan 30 , 2026 | 06:08 AM