Share News

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:42 PM

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో తాను క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో ఇటీవల అతడు వెల్లడించాడు. ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు..

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..
Yuvraj Singh

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) ఒకడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు అందించిన సేవలు మరువలేనివి. టీ20 ప్రపంచకప్‌- 2007, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ టైటిళ్లను భారత్‌ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలక పాత్ర. ఇక యువీకి క్రికెట్‌లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ .. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి తప్పుకొన్నాడు. అయితే అప్పట్లో తాను రిటైర్‌మెంట్(Yuvraj Singh retirement reason) ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తాజాగా వెల్లడించాడు.


ఇటీవల భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా(Sania Mirza) నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ సింగ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ..' కెరీర్ భారంగా మారింది. అలానే నా ఆటను నేను ఆస్వాదించలేకపోయాను. మరోవైపు నాకు మద్దతు, గౌరవం లభించలేదని అనిపించింది. అలాంటప్పుడు నేను ఇంకా ఎందుకు క్రికెట్‌ ఆడాలి అని భావించాను. ఆట నాకెంతో ఇచ్చింది. నేను అత్యుత్తమ ప్రదర్శనలు చేశాను. ఇంకా నేను ఏం నిరూపించుకోవాలి. మానసికంగా, శారీరకంగా ఇంతకుమించి చేయలేననిపించింది. అలానే నాలో ఏదో తెలియని బాధ. ఈ కారణాలన్నింటితో ఆటను ఇక ఆపేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానో.. అప్పుడే మళ్లీ అసలైన నన్ను చేరుకోగలిగాను. అందుకే క్రికెట్‌ నుంచి రిటైరయ్యాను’ అని యువరాజ్‌.. తాను పడిన మానసిక వేదనను బయటపెట్టాడు.


ఇక యువీ కెరీర్(cricket career) విషయానికి వస్తే.. 2007 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లాండ్ మ్యాచ్‌లో 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి.. తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే వరల్డ్‌కప్‌-2011లో 362 పరుగులు చేయడంతో పాటూ 15 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తద్వారా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డు అందుకున్నాడు. టీమిండియా తరఫున 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో పాల్గొన్న యువీ.. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలోనూ భాగమయ్యాడు. యువరాజ్‌ సింగ్‌ తన కెరీర్‌లో 40 టెస్టు మ్యాచుల్లో 1,900 రన్స్ చేశాడు. 304 వన్డేల్లో 8,701 పరుగులు సాధించాడు. 58 టీ20ల్లో 1,177 పరుగులు చేశాడు.

Updated Date - Jan 29 , 2026 | 05:04 PM