సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్
ABN , Publish Date - May 19 , 2026 | 03:09 PM
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని తప్పించి సంజు శాంసన్‌కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సీఎస్కే 5 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పేలవ ప్రదర్శన కనుబరుస్తున్నాడంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి సంజు శాంసన్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
‘టీ20 క్రికెట్‌లో ప్లేయర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ వంటి పెద్ద ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉండటం అంత సులువైన విషయం కాదు. కెప్టెన్సీ అనేది ఆటగాడిపై అదనపు భారం మోపుతుంది. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ విషయంలో అదే జరిగింది. కెప్టెన్‌గా జట్టుకు ట్రోఫీ అందించాలనే ఒత్తిడిలో ఒక బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ధోని యుగం ముగిసింది. ఇప్పుడు సీఎస్కే జట్టు మార్పుల దశలో ఉంది. ధోని తర్వాత కొత్త నాయకత్వాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది. అభిమానులు ఈ విషయంలో కాస్త సహనం పాటించాలి. సీఎస్కేకు ఉన్న చరిత్ర వల్ల ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. అయితే కొత్త జట్టుకు ఎదగడానికి కొంత సమయం ఇవ్వాలి’ అని అశ్విన్ వెల్లడించాడు.
బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి: ఆరోన్ ఫించ్
రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా స్పందించాడు. ‘కేవలం ఒక సీజన్ ఆధారంగా కెప్టెన్ సామర్థ్యాన్ని అంచనా వేయడం సరైంది కాదు. మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో రుతురాజ్ మంచి పరిపక్వత చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడు తిరిగి తన బ్యాటింగ్ లయను అందుకోవడంపై దృష్టి పెట్టాలి. జట్టు కోసం పరుగులు చేయాలి’ అని పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్
బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు