బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి రాదు
ABN , Publish Date - May 19 , 2026 | 01:23 AM
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) స్పష్టంజేసింది. దేశంలో క్రికెట్‌ను...
కేంద్ర సమాచార కమిషన్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి రాదని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) స్పష్టంజేసింది. దేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు బీసీసీఐ ప్రైవేట్ సంస్థగా పని చేస్తోందని, అది తన సొంత నియమ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నదని సీఐసీ కమిషనర్ పీఆర్ రమేశ్ పేర్కొన్నారు. బీసీసీఐ పని తీరుకు సంబంధించిన వివరాలు కోరుతూ.. ఆర్టీఐ ద్వారా బోర్డు సమాచారాన్ని పొందవచ్చా, లేదా అంటూ దాఖలైన కేసులో సీఐసీ సోమవారం ఈ తీర్పు వెలువరించింది. ఆర్టీఐ చట్టంలోని 2 (హెచ్)కింద బీసీసీఐని పబ్లిక్ అథారిటీగా ప్రకటిస్తూ 2018లో అప్పటి సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమేరకు ప్రజా సంబంధ అధికారులను నియమించాలని, ఆర్టీఐ దరఖాస్తులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన బీసీసీఐని ఆదేశించారు. ఈ తీర్పును మద్రాస్ హైకోర్టులో బీసీసీఐ సవాలు చేసింది. తాము ప్రభుత్వ నిధులు పొందడంలేదని, అందువల్ల తమది స్వతంత్ర సంస్థగా బోర్డు వాదించింది. ఈనేపథ్యంలో బోర్డు ఆర్టీఐ పరిధిలోకి వస్తుందో, రాదో తేల్చాలని సీఐసీకి మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈక్రమంలో సీఐసీ కమిషనర్ రమేశ్ తాజా తీర్పు వెలువరించారు. తమిళనాడు సొసైటీల చట్టం కింద నమోదైనందువల్ల బీసీసీఐ అధికార సంస్థ కాదని ఆయన తేల్చారు. క్రికెట్ పాలన, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ఎంపిక చేసే కీలకమైన వ్యవహారాలను బీసీసీఐ పర్యవేక్షిస్తున్నా..అది ఆర్టీఐ పరిధిలోకి రాదన్నారు. అంతేకాదు..ఆర్టీఐ కింద బీసీసీఐ సమాచారాన్ని కోరుతూ దాఖలైన అప్పీలును రమేశ్ కొట్టివేశారు.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్