Share News

రైజర్స్‌.. రైట్‌ రైట్‌

ABN , Publish Date - May 19 , 2026 | 01:26 AM

ఇషాన్‌ కిషన్‌ (47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) అద్భుత ఆటతీరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టింది. అటు తమ బెర్త్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే...

రైజర్స్‌.. రైట్‌ రైట్‌

ఒక్క ఫలితం.. రెండు బెర్త్‌లు

గుజరాత్‌ కూడా ముందుకు

చెన్నైకి తప్పని ఓటమి

చెన్నై: ఇషాన్‌ కిషన్‌ (47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) అద్భుత ఆటతీరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టింది. అటు తమ బెర్త్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తేలిపోయింది. చెపాక్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన చెన్నై చివరి వరకు పోరాడినా 5 వికెట్ల తేడాతో ఓడింది. అయితే చెన్నెన 12 పాయింట్లతో ఇప్పటికీ అధికారికంగా రేసులోనే ఉన్నా తమ ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలిచి.. పోటీగా ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ ఓడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఫలితంతో.. రైజర్స్‌తో పాటు 16 పాయింట్లతో ఉన్న గుజరాత్‌ కూడా ప్లేఆ్‌ఫ్సలో ప్రవేశించడం విశేషం. మరే జట్టుకు ఇన్ని పాయింట్లు వచ్చే చాన్స్‌ లేకపోవడమే ఇందుకు కారణం. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. బ్రెవిస్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44), కార్తీక్‌ శర్మ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32), సంజూ శాంసన్‌ (13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) రాణించారు. కమిన్స్‌కు 3, సకీబ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 19 ఓవర్లలో 181/5 స్కోరు చేసి గెలిచింది. క్లాసెన్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47) కీలకంగా నిలిచాడు. ముకేశ్‌కు 2 వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఇషాన్‌ నిలిచాడు.


ఆదుకున్న ఇషాన్‌: కఠిన పిచ్‌పై ఛేదనకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ నిదానంగానే ఆరంభించింది. మధ్య ఓవర్లలో అండగా నిలిచిన ఇషాన్‌ దాదాపు చివరి వరకు నిలిచి చెన్నైకి చెక్‌ పెట్టాడు. అతడికి క్లాసెన్‌ సహకరించాడు. ఓపెనర్‌ హెడ్‌ (6) మూడో ఓవర్‌లో వెనుదిరగ్గా.. స్పిన్నర్లు అకీల్‌, నూర్‌ కట్టడి చేయడంతో అభిషేక్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్‌ 45 రన్ష్‌కే పరిమితమైంది. ఆ తర్వాత 8వ ఓవర్‌లో అభిషేక్‌ను అకీల్‌ అవుట్‌ చేయడంతో చెన్నైకి పట్టు చిక్కినట్టయ్యింది. అటు క్రీజులో ఉన్న ఇషాన్‌-క్లాసెన్‌ కూడా వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడాల్సి వచ్చింది. దీంతో తొలి 10 ఓవర్లలో రైజర్స్‌ 75 రన్సే చేసింది. కానీ, ఆ తర్వాత క్లాసెన్‌ చెలరేగాడు. దీనికితోడు 11వ ఓవర్‌లో అతడి క్యాచ్‌ను జాన్సన్‌ వదిలేయడం చెన్నైని దెబ్బతీసింది. అదే ఓవర్‌లో క్లాసెన్‌ 6,4 బాదాడు. ఇషాన్‌ కూడా బౌండరీలు రాబట్టడంతో మ్యాచ్‌ రైజర్స్‌ వైపు మొగ్గుచూపింది. 15వ ఓవర్‌లో శాంసన్‌ మెరుపు స్టంపింగ్‌తో క్లాసెన్‌ వెనుదిరగడంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే నితీశ్‌ (11) అవుటైనా.. రన్‌రేట్‌ అదుపులోనే ఉండడంతో రైజర్స్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. ఇక 12 బంతుల్లో 13 రన్స్‌ కావాల్సిన వేళ.. 19వ ఓవర్‌లో ఇషాన్‌ అవుటైనా సలీల్‌ (10 నాటౌట్‌) సిక్సర్‌, స్మరణ్‌ (5 నాటౌట్‌) ఫోర్‌తో మ్యాచ్‌ ముగిసింది.


మెరుపుల్లేవ్‌..: టాస్‌ గెలిచిన చెన్నై ప్రత్యర్థి ముందు భారీ స్కోరును ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ పిచ్‌ నుంచి వీరికేమాత్రం సహకారం లభించలేదు. అయితే ఓపెనర్‌ శాంసన్‌, కార్తీక్‌, ఉర్విల్‌ (13), బ్రెవిస్‌ వేగం చూపడంతో కాస్త సవాల్‌ విసిరే స్కోరందుకుంది. ఇక ఓపెనర్‌ రుతురాజ్‌ (15) 12 ఓవర్లపాటు బ్యాటింగ్‌ సాగించినా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బందిపడ్డాడు. అయితే ఆరంభంలో శాంసన్‌ ధనాధన్‌ ఆటతో తొలి ఓవర్‌లోనే 6,4,4తో 17 రన్స్‌ రాబట్టాడు. అలాగే రెండో ఓవర్‌లోనూ హ్యాట్రిక్‌ ఫోర్లు బాదడంతో చెపాక్‌లో జోష్‌ కనిపించింది. కానీ తర్వాతి ఓవర్‌లోనే పేసర్‌ కమిన్స్‌ అతడిని దెబ్బతీశాడు. అయితే ఉర్విల్‌ వచ్చీ రాగానే రెండు వరుస సిక్సర్లతో మురిపించాడు. అతడిని ఎక్కువ సేపు నిలువనీయకుండా పేసర్‌ సకీబ్‌ బౌల్డ్‌ చేయడంతో, పవర్‌ప్లేలో జట్టు 57/2 స్కోరుతో నిలిచింది. అటు రుతురాజ్‌ ఇబ్బందిపడినా.. కార్తీక్‌ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాడు. ఎనిమిదో ఓవర్‌లో 4,6,4తో 16 రన్స్‌ అందించాడు. అయితే ఈ దశలో ప్యాట్‌ కమిన్స్‌ మరోసారి షాకిస్తూ తన వరుస ఓవర్లలో కార్తీక్‌, రుతురాజ్‌ల వికెట్లు తీశాడు. వీరి మధ్య మూడో వికెట్‌కు 42 పరుగులు జత చేరాయి. ఈ స్థితిలో బ్రెవి్‌స-దూబే జోడీ కాస్త నిలదొక్కుకుంది. 14వ ఓవర్‌లో బ్రెవిస్‌ 4,4,6.. 16వ ఓవర్‌లో 6,4తో స్కోరులోనూ కదలిక వచ్చింది. చివర్లో ఎదురుదాడికి దిగే క్రమంలో ఈ జోడీ వరుస ఓవర్లలో వెనుదిరగ్గా ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆఖరి ఓవర్‌లో పేసర్‌ హింగే తొమ్మిది పరుగులే ఇచ్చి ప్రశాంత్‌ (11) వికెట్‌ తీయడంతో సీఎ్‌సకే 180 రన్స్‌తో ఫర్వాలేదనిపించింది.


స్కోరుబోర్డు

చెన్నై: సంజూ (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 27, రుతురాజ్‌ (సి) మలింగ (బి) కమిన్స్‌ 15, ఉర్విల్‌ (బి) సకీబ్‌ 13, కార్తీక్‌ (సి) నితీశ్‌ (బి) కమిన్స్‌ 32, బ్రెవిస్‌ (బి) మలింగ 44, దూబే (బి) సకీబ్‌ 26, ప్రశాంత్‌ (సి అండ్‌ బి) హింగే 11, అకీల్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 180/7; వికెట్ల పతనం: 1-31, 2-48, 3-90, 4-100, 5-159, 6-164, 7-180; బౌలింగ్‌: నితీశ్‌ 2-0-35-0, హింగే 3-0-37-1, కమిన్స్‌ 4-0-28-3, మలింగ 4-0-26-1, సకీబ్‌ హుస్సేన్‌ 4-0-34-2, శివాంగ్‌ 3-0-20-0.

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) జాన్సన్‌ (బి) అకీల్‌ 26, హెడ్‌ (సి అండ్‌ బి) ముకేశ్‌ 6, ఇషాన్‌ (సి) ఉర్విల్‌ (బి) అన్షుల్‌ 70, క్లాసెన్‌ (స్టంప్డ్‌) శాంసన్‌ (బి) నూర్‌ 47, నితీశ్‌ (సి) ఉర్విల్‌ (బి) ముకేశ్‌ 11, సలీల్‌ (నాటౌట్‌) 10, స్మరణ్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19 ఓవర్లలో 181/5; వికెట్ల పతనం: 1-18, 2-56, 3-131, 4-153, 5-175; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-36-2, జాన్సన్‌ 3-0-26-0, అన్షుల్‌ 4-0-46-1, నూర్‌ అహ్మద్‌ 4-0-40-1, అకీల్‌ హుస్సేన్‌ 3-0-21-1, శివమ్‌ దూబే 1-0-12-0.

1-Sports.jpg

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 19 , 2026 | 01:26 AM