Share News

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు

ABN , Publish Date - May 18 , 2026 | 03:00 PM

బీసీసీఐకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వర్తించదని కేంద్ర సమాచార కమిషన్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బీసీసీఐ.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు పొందడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణలో లేని ఒక ప్రైవేట్ సంస్థ.. ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది.

బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు
BCCI

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ పరిపాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీసీసీఐకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) వర్తించదని కేంద్ర సమాచార కమిషన్ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. బీసీసీఐ.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు పొందడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నియంత్రణలో లేని ఒక ప్రైవేట్ సంస్థ.. ఆర్టీఐ పరిధిలోకి రాదని తెలిపింది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే హక్కు బీసీసీఐకి ఎలా వచ్చిందనే అంశంతో పాటు, జాతీయ-అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు ఆటగాళ్ల ఎంపిక ఎలా జరుగుతుందనే వివరాలు కోరుతూ దాఖలైన అప్పీల్‌ను సీఐసీ తిరస్కరించింది.


అయితే ఇదే అంశంపై 2018లో సీఐసీ భిన్న నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఆటగాళ్లు దేశం పేరుతో జెర్సీలు ధరించడం, బీసీసీఐకి వివిధ రూపాల్లో ప్రభుత్వ సహకారం లభిస్తుందనే వాదనలతో బోర్డును ప్రజా సంస్థగా పరిగణించింది. అప్పట్లో బీసీసీఐపై ఆర్టీఐ వర్తిస్తుందని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ బీసీసీఐ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు గత తీర్పులను పరిగణనలోకి తీసుకుని తిరిగి పరిశీలించాలని సీఐసీకి సూచించింది. అనంతరం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కేసును తిరిగి విచారించిన సీఐసీ తాజా తీర్పును వెలువరించింది. ‘బీసీసీఐ రాజ్యాంగం ద్వారా గానీ, పార్లమెంట్ చట్టం ద్వారా గానీ, రాష్ట్ర శాసనసభ లేదా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా గానీ ఏర్పాటు కాలేదు. ఇది తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదైన ఒక సోసైటీ మాత్రమే. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం బీసీసీఐ ‘పబ్లిక్ అథారిటీ’ కిందికి రాదు. దీంతో ఆర్టీఐ చట్టం కింద సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉండదు’ అని సీఐసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.


ప్రధాన కారణాలివే..

ఆర్టీఐ చట్టం నుంచి బీసీసీఐకి మినహాయింపు ఇవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలను కమిషన్ ప్రస్తావించింది. ‘ప్రభుత్వానికి బీసీసీఐ కార్యకలాపాలపై ప్రత్యక్ష లేదా విస్తృత నియంత్రణ లేదు. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ విక్రయాల ద్వారా బీసీసీఐ స్వతంత్రంగా ఆదాయం సమకూర్చుకుంటుంది. పన్ను రాయితీలు లేదా చట్టపరమైన సౌకర్యాలను ప్రభుత్వ నిధులుగా పరిగణించలేం. అంతే కాకుండా భారత క్రికెట్‌లో పారదర్శకత అవసరమని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పటికీ.. బీసీసీఐను ప్రజా సంస్థగా ప్రకటించలేదు. వలస పాలన కాలంలో ఏర్పడిన బీసీసీఐ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌కు ఆర్థిక కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నీ వల్ల బీసీసీఐ వాణిజ్య పరంగానూ దూసుకెళుతోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం బీసీసీఐ ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. ఇందుకోసం ప్రత్యేక చట్ట సవరణ లేద ప్రభుత్వ నిర్ణయం అవసరం’ అని కమిషన్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

సీఎస్కే-ఎస్ఆర్‌హెచ్: ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకనున్నాడా?

Updated Date - May 18 , 2026 | 03:00 PM