వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే
ABN , Publish Date - May 19 , 2026 | 02:35 PM
వచ్చే ఐపీఎల్ సీజన్‌లో అయినా ధోని చెన్నై జెర్సీలో కనిపిస్తాడా? కీపింగ్ గ్లవ్స్‌తో స్టంప్స్ వెనకాల నిలబడతాడా? అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ధోని భవిష్యత్తుపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వైపు ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని రిటైర్‌మెంట్ చర్చ తారస్థాయికి చేరుకుంది. ఈ సీజన్‌లో సోమవారం సీఎస్కే.. చెపాక్‌లో తన ఆఖరి మ్యాచ్ ఆడేసింది. గాయం కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడతాడని భావించారు. కానీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. సీఎస్కే లీగ్ స్టేజ్‌లో మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. అందులో తలా బరిలోకి దిగే అవకాశాలు దాదాపుగా లేవు. అయితే ధోని అభిమానుల మదిలో ప్రస్తుతం ఒకటే ప్రశ్న మెదులుతోంది.. వచ్చే సీజన్‌లో అయినా తలా చెన్నై జెర్సీలో కనిపిస్తాడా? కీపింగ్ గ్లవ్స్‌తో స్టంప్స్ వెనకాల నిలబడతాడా? ఈ నేపథ్యంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. ధోని భవిష్యత్తుపై స్పందించాడు.
‘ఈ ఏడాది ధోని జట్టుతో ఎక్కువ సమయం గడిపాడు. యువ ప్లేయర్లకు అది ఎంతో ఉపయోగపడింది. ధోని ఆడకపోయినా జట్టుపై అతడి ప్రభావం చాలా ఉంది. ఈ ఏడాది మేం చాలా ప్రయోగాలు చేశాం. కొత్త తరం ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం. అయితే ధోని వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనేది నేను నిర్ణయించలేను. పూర్తిగా మేనేజ్‌మెంట్ నిర్ణయం మీదే ధోని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే, ధోని ఈ సీజన్‌లో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కోసం ఉద్దేశపూర్వకంగానే మైదానంలోకి దిగలేదనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సీఎస్కే 5 వికెట్ల తేడాతో ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్(70) అద్భుతమైన ప్రదర్శనతో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే. లీగ్ స్టేజ్‌లో చెన్నై ఇంకా ఒక మ్యాచ్ ఆడనుంది. మే 21న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ధోని ఆడతాడని అనుకోవడం లేదు: సునీల్ గావస్కర్
బీసీసీఐకి ఆర్టీఐ వర్తించదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు