Share News

ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:13 AM

టెస్టుల్లో అద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన యశస్వి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇదే విషయంపై స్పందించాడు.

ఇషాన్ కిషన్ వల్లే యశస్వికి జట్టులో చోటు దక్కడం లేదు: ఆకాశ్ చోప్రా
Aakash Chopra

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ సిరీస్‌లో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా భావిస్తోన్న ఈ కివీస్ సిరీస్‌లో యశస్వికి చోటు దక్కకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో అద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగిన యశస్వి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇదే విషయంపై స్పందించాడు. రానున్న వన్డే ప్రపంచ కప్‌లో యశస్వికి చోటు దక్కడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.


‘జట్టులో వికెట్ కీపర్‌తో పాటు ఓపెనర్‌గా సేవలందించే ప్లేయర్ ఉంటే అదనపు బ్యాటర్‌ను ఎంపిక చేసే అవకాశాలు తగ్గుతాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఆ రెండు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. దీంతో జైస్వాల్‌కు అవకాశం దక్కడం లేదు. ఇషాన్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా తీసుకుంటే.. మరో బ్యాటర్‌ను ఎంపిక చేయడం కంటే అదనపు ఆల్‌రౌండర్ లేదా ఫాస్ట్ బౌలర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇషాన్ కిషన్ వల్లే యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం జైస్వాల్ భారత వన్డే జట్టులో కూడా లేడు. ఈ పరిస్థితుల్లో ప్రపంచకప్‌ జట్టులో అతడికి స్థానం లభించడం కష్టమే.


మరోవైపు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే అతడిని ఎంపిక చేస్తే వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు చోటు దక్కకపోవచ్చు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా ప్రపంచకప్ జరగనుండటంతో అక్కడి పరిస్థితులు పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. అందుకే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇవ్వవచ్చు’ అని ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

Updated Date - Oct 20 , 2026 | 07:13 AM