Share News

28న డబ్ల్యూపీఎల్ వేలం.. 27 స్థానాల కోసం బరిలోకి 146 మంది ప్లేయర్లు

ABN , Publish Date - Oct 19 , 2026 | 09:38 PM

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు ముందు ప్లేయర్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి వేదికగా జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 146 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు.

28న డబ్ల్యూపీఎల్ వేలం.. 27 స్థానాల కోసం బరిలోకి 146 మంది ప్లేయర్లు
WPL 2027 auction

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు ముందు ప్లేయర్ల వేలానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి వేదికగా జరగనున్న ఈ వేలం కోసం మొత్తం 146 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమలిని, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా, ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్, శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు వంటి స్టార్ ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఫ్రాంచైజీలు తమ జట్లలో మిగిలిన 27 స్థానాలను భర్తీ చేసుకునేందుకు ఈ వేలంలో పాల్గొననున్నాయి.


వేలం జాబితాలో 119 మంది భారత ప్లేయర్లు(22 క్యాప్డ్, 97 అన్‌క్యాప్డ్) ఉన్నారు. వీరు 20 స్లాట్ల కోసం పోటీ పడుతున్నారు. 27 మంది విదేశీ క్రికెటర్లు(14 క్యాప్డ్, 13 అన్‌క్యాప్డ్) 7 స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ప్లేయర్ల కనీస ధరలను రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షలుగా నిర్ణయించారు. అత్యధిక బేస్ ప్రైస్ రూ.50 లక్షలుగా ఉంది. ఈ విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్, ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ ఉన్నారు.


యువ వికెట్ కీపర్ బ్యాటర్ జి. కమలిని ఈ వేలంలో కీలక ఆకర్షణగా నిలవనుంది. గత సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఆమెను విడుదల చేయగా.. ఇప్పుడు రూ.40 లక్షల బేస్ ప్రైస్ విభాగంలో పేరు నమోదు చేసుకుంది. ఇదే ధర విభాగంలో భారత బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు హీథర్ గ్రాహమ్, జెస్ జొనాసెన్ కూడా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన స్నేహ్ రాణా రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి రానుంది. శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టు కూడా ఇదే ధర విభాగంలో ఉంది.


ఫ్రాంచైజీలకు కీలకమైన వేలం

2027 సీజన్‌కు ముందు జట్ల కూర్పును మార్చుకునేందుకు ఫ్రాంచైజీలకు ఈ వేలం మంచి అవకాశం కానుంది. మొత్తం 146 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా.. భర్తీ చేయాల్సిన స్థానాలు మాత్రం 27 మాత్రమే. దీంతో ఆటగాళ్ల ఎంపిక, బేస్ ప్రైస్, జట్ల అవసరాల ఆధారంగా వేలంలో పోటీ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. ముఖ్యంగా కమలిని, మోలినెక్స్, డంక్లీ, స్నేహ్ రాణా వంటి ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎంతవరకు వెచ్చిస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.


ఇవి కూడా చదవండి:

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ఎఫెక్ట్.. ఆ కామెంటేటర్లపై పాక్ బోర్డు వేటు!

Updated Date - Oct 19 , 2026 | 09:38 PM