Share News

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:28 PM

బీసీసీఐ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీలో కీలక మార్పులు చేసింది. చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాను నియమించింది. భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌కు కొత్త సెలెక్షన్ ప్యానెల్‌లో చోటు కల్పించింది.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ఓజా.. ప్యానెల్‌లో రమేశ్ పొవార్‌కు చోటు
Pragyan Ojha, Ramesh Powar

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ పురుషుల జట్టు సెలెక్షన్ కమిటీలో కీలక మార్పులు చేసింది. చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజాను నియమించింది. భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌కు కొత్త సెలెక్షన్ ప్యానెల్‌లో చోటు కల్పించింది. పదవీకాలం పూర్తి అవ్వకముందే అజిత్ అగార్కర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్షర్‌గా వ్యవహరించిన ఓజానే ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆ బాధ్యతలు అందుకున్నాడు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీకి ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వం వహించనున్నాడు.


రమేశ్ పొవార్ నియామకాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఏకగ్రీవంగా సిఫారసు చేసినట్లు బీసీసీఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. దరఖాస్తులను పరిశీలించి, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం పొవార్ పేరును ఖరారు చేసింది. టెస్టుల్లో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ప్రజ్ఞాన్ ఓజాకు కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ప్యానెల్‌లో శివసుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రాతో పాటు రమేశ్ పొవార్ సభ్యులుగా కొనసాగనున్నారు.


రమేశ్ పొవార్ భారత జట్టు తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేశాడు. భారత మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించడంతో పాటు ముంబై, గుజరాత్ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గానూ సేవలందించాడు. భారత మహిళల జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించడంలో జట్టు కీలక ప్రదర్శన చేసింది. ఈ అనుభవం ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఆయనకు ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే, మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సేవలను బీసీసీఐ ప్రత్యేకంగా గుర్తుచేసుకుంది. 2023 జులైలో ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన హయాంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను కూడా గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి:

పారా ఆసియా గేమ్స్: లాంగ్‌జంప్‌లో నిషద్‌కు స్వర్ణం

నవరాత్రి వేడుకల్లో ధోని సందడి.. అంబానీ ఫ్యామిలీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ..!

Updated Date - Oct 19 , 2026 | 04:43 PM